జెండా నీ పేరు జెప్పి...

ABN , First Publish Date - 2022-08-13T06:59:15+05:30 IST

జాదూ జేస్తున్నరు. మూడు రంగుల జెండ బట్కోని దిర్గుతున్నరు. ఎప్పుడు పంద్రాగస్టునాడు జెండపండ్గ వొస్తది.

జెండా నీ పేరు జెప్పి...

జాదూ జేస్తున్నరు. మూడు రంగుల జెండ బట్కోని దిర్గుతున్నరు. ఎప్పుడు పంద్రాగస్టునాడు జెండపండ్గ వొస్తది. గని గీసారి ముందుగాలే వొచ్చినట్లు గొడ్తున్నది. బిజెపోల్లు మూడు రంగుల జెండలు బట్కోని తిర్గబట్టిండ్రు. మేము జెయ్యబట్కే దేశం ముంగట్కి బోతున్నది. మేము జెయ్యబట్కె మూడు రంగుల జెండ మొగులు మీద ఎగురుతున్నది. మేము ఎగిరేసిన జెండనే జెనాలు జూస్తున్నరు. సల్యూట్‌ గొడ్తున్నరు అని గాల్లు జెప్పబట్టిండ్రు. కాంగ్రెస్‌ లీడర్లు మూడు రంగుల జెండబట్కోని తిరుక్కుంట ససంత్రం మేమే దెచ్చినం. మాతోనే దేశం బాగైతది. గాంది మావోడు. గాయినను సంపిన గాడ్సే ఎవడో ఎర్కజేస్కోండ్రి. బిజెపోల్లు యాడనన్న సంతంత్రం దెచ్చిండ్రా. మాతోనే దేశం బాగైతది అని జెప్పబట్టిండ్రు.


మనకు ససంత్రమొచ్చి డెబ్బైదు యాడాదులయ్యింది. దాంతోని పంద్రాగస్టు రాక ముందె లీడర్లు జెండ పండ్గ జేస్తున్నారు. ఇగ టిఆర్‌ఎస్‌ లీడర్లు గుడ్క మూడు రంగులు జెండలు బట్కోని దిర్గబట్టిండ్రు. తెలంగాణని మేమే దెచ్చినం, మేమే ఇచ్చినం అని కాంగ్రెస్సోలంటరు. గాల్ల మాటలు నమ్మకుండ్రి, ఇయ్యాల మేమే రాష్ట్రంను బంగారు రాష్ట్రం జేసినం రేపొద్దుగాల దేశంను గుడ్క మేమే బాగజేస్తం పట్నంలనే గాకుంట డిల్లిల సుత జెండ ఎగ్రేస్తం అని అనబట్టిండ్రు.


మొన్న మా వూరు కెల్లి మా కాకవొచ్చిండు. కాక అంటె సంత కాక గాదు. బోన్గిరిల గాయిన మా వాడకట్టుల ఉండెటోడు. గిప్పుడు గూడ గాయిన గాన్నే ఉంటున్నడు. ఊల్లె నాకు గిసువంటి కాకలున్నరు. మామలున్నరు. బావలున్నరు. తాతలున్నరు. అమ్మలున్నరు. అన్నలున్నరు. అక్కలున్నరు. తమ్ముండ్లున్నరు. చెల్లెండ్లున్నరు. ఉన్నోల్లందరు నా సుట్టాలే.

‘పట్నంల గల్లి గల్లిల జెండ పండ్గ జేస్తున్నట్లు గొడ్తున్నది. పండ్గలేంది గని నువ్వు బాగున్నవార. అని మా కాక అడిగిండు.

‘బాగున్న అంటె బాగున్న’

‘ఏందిరో గట్లంటున్నవు?’


‘మా ఆనంద్‌బాగ్ల బగ్గ దోమలున్నయి కాకా! గవ్వి ఒక్క తీర్గ కుట్టికుట్టి సంపుతున్నయి. గవ్వి జెయ్యబట్కె మా చిన్నోన్కి మలేరియ వచ్చింది. గా రోగంతోని మావోడు బూరు బీకిన కోడి తీరు బొక్కయిపోయిండు’.

‘దోమలు బోయెతంద్కు మున్సిపల్‌ కార్పొరేషనోల్లు పొగగొడ్తలేరా?’

‘కొడ్తున్నరు కాకా! పొగ గొట్టినా గవ్వి బోతలేవు’

పొగబెట్టండనే బోయెతంద్కు గవ్వేమైన ఈటెల రాజేందరారా?’ అని నగుకుంట మా కాక అన్నడు.గా ముచ్చట గీ ముచ్చట మాట్లాడినంక నాస్త జేసి ఛాయ్‌ దాగి ‘వొస్త’ అన్కుంట కాక బోయిండు.


పట్నంల మంత్రి మూడు రంగుల బుగ్గలు ఎగిరేసిండు. జెనంకు జెండలు బంచిండు. గా జెండలను ఇండ్ల మీద ఎగిరెయ్యమన్నడు. గంతే గాకుంట మూడు రంగుల రాకిలు గుడ్క ఇచ్చిండ్రు. గవ్వి గూడ కట్టుకోమన్నరు.


‘జెండెగిరియ్యాలంటె ఇల్లుండాలె. ఇల్లే లేకపాయె. జెండిచ్చుడు గాదు ముందుగాల ఇల్లియుండ్రి’ అని ఒక ముస్లోడు అన్నడు.


రాకి పండ్గనాడు ఒకామె అన్న తాన్కి బోయింది. ఆమె అన్న ఒక సర్కార్‌ దప్తర్ల కొల్వు జేస్తున్నడు. మూడు రంగులున్న రాకిని అన్న చెయ్యికి గట్టింది. ఎప్పటి తీర్గనే అన్న కట్నం ఇస్తడని గామె అనుకున్నది గాని గాయిన మూడు రంగుల జెండను గామె కిచ్చిండు.


‘ఏందన్నా! కట్నమియ్యకుంట గీ జెండ ఇచ్చినవేందే’ అని అడిగింది. ‘నాకు జీతం బడలేదు, జీత మొంతుకు మూడు రంగుల జెండ ఇచ్చిండ్రు’ అని గాడు జెప్పిండు.


ఎంతో మంది లీడర్లు చెట్లు నాటబట్టిండ్రు. ఒక లీడర్‌ చెట్టు నాటుతుంటే వాన కుర్వబట్టింది. వానగొడ్తున్నదని ఒక చెంచగాడు గాయినకు చెత్రిబట్టిండు. నాటిన చెట్టుకు నీల్లు బోస్కుంట గాయిన పోట్వ దగిండు.


‘ఏందన్నా! ఒక దిక్కు వాన గొడ్తుంటె చెట్టుకు నీల్లు బోసినవేంది?’ అని అడిగితె– ‘పలాని లీడర్‌ చెట్టు నాటిండు. గని నాటిన చెట్టుకు నీల్లు బొయ్యలేదు అని అనేటి మోక అపొజిషనోల్లకు ఇయ్యకుంట’ అని గాయిన అన్నడు.


పట్నంల ఒక లీడర్‌ శాన్‌దార్‌ మోటర్ల బోతుండు. చౌరస్త వొచ్చింది. ఎర్రలైటు బడ్డది. దాంతోని గాయిన మోటర్‌ ఆగింది. ఒక పోరడు జెండలు బట్కోని గాయిన తాన్కి వొచ్చిండు.


‘వారీ ఒకపారి దస్తిలు అమ్ముతవు. ఒకపారి దువ్వెనలు అమ్ముతవు. ఒకపారి పేపర్లు అమ్ముతవు. ఇంకోపారి పిన్నీసులు అమ్ముతవు. నువ్వు అమ్మనిదేమన్న ఉన్నదార?’ అని లీడర్‌ అడిగిండు.

‘ఉన్నది సార్‌’

‘గదేందిరా?’

‘దేశం’ అని గా పోరడన్నడు.


తెలిదేవర భానుమూర్తి

Updated Date - 2022-08-13T06:59:15+05:30 IST