స్వాతంత్య్రం వాయువులు పీలుస్తూ సాగిపోయా

ABN , First Publish Date - 2022-08-12T09:13:34+05:30 IST

‘స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు / సామర్థ్యంతో నిర్వహిస్తామని/సంకల్పం చెప్పుకున్న..’

స్వాతంత్య్రం వాయువులు పీలుస్తూ సాగిపోయా

‘స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు / సామర్థ్యంతో నిర్వహిస్తామని/సంకల్పం చెప్పుకున్న..’ నవజీవన నిర్మాతలలో ఒకరైన డాక్టర్ ఆదిపూడి రంగనాథరావు (1930–2014) తెలుగునాట ప్రప్రథమ యూరాలజిస్టు. స్వతంత్ర భారతదేశపు తొలి బ్యాచ్ వైద్యుల్లో ఒకరైన రంగనాథరావు విశాఖ మన్యంలోని చింతపల్లి ప్రాంత గిరిజనులకు తన తొలి వైద్య సేవలు అందించారు. సహాధ్యాయిని డాక్టర్ యశోధర దేవిని కులాంతర వివాహం చేసుకున్నారు. స్వాతంత్ర్య అమృత ఉత్సవాల సందర్భంగా ఈ అసామాన్య పౌరుణ్ణి గుర్తు తెచ్చుకోవడమంటే ఆ నాటి మన జాతి పెద్దల ఔన్నత్యాన్ని ఆవాహన చేసుకోవడమే.


ఏ స్వాతంత్ర్య నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశ సేవా

భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞు లుత్పజ్ఞులంతా

అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగింట చేర్చా

రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే

నవోదితస్వాధీనతానందితోత్ఫుల్లమైన నగరం జెండాల పంటలతో నవ్వుతూ పాడుతూ ఉండే 

ఉత్సాహ ప్రవాహంలో నేనూ ఒక బిందువునై

స్వాతంత్ర్య వాయువులు పీలుస్తూ సాగిపోయా

– శ్రీశ్రీ, ‘మహా సంకల్పం’


స్వాతంత్ర్యం వచ్చిన క్షణం అపురూపమైనది. మహాకవి పుట్టిన ఊరులోని ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు ఆ శుభ తరుణాన్ని ఎలా ఆనందోత్సాహాలతో వేడుక చేసుకున్నారో వారిలో ఒకరైన డాక్టర్ ఆదిపూడి రంగనాథరావు తన ఆత్మకథ ‘నేను... నా స్కాల్పెల్’లో ఇలా వివరించారు : ‘సరిగ్గా ఆ రోజుకి నేను మెడిసిన్‌లో చేరి నెల్లాళ్లు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో అర్ధరాత్రి నుంచి ఒకటే కోలాహలం. ప్రతి ఒక్కరిలోను ఆనందం. వర్ణించడానికి వీల్లేనంత ఉద్వేగం. మా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరి ముఖాల్లోనూ అనుకున్నది సాధించామన్న సంతృప్తి. కొందరి కళ్లు ఆనందంతో వర్షిస్తున్నాయి. ఆనందబాష్పాలను తుడుచుకుంటూనే ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. కాకినాడ పట్టణంలో ఇంటర్ ముగించుకుని విశాఖపట్నంలో వైద్య విద్య కోసం వచ్చిన నాకు ... నాలాంటి అనేక మంది విద్యార్థులకు ఆ అనందభరిత వాతావరణంలో పాలుపంచుకోవాలన్న తహ తహ పెల్లుబికింది.


తూర్పు సముద్రంలో వెలుగురేకలు విచ్చుకుంటున్నాయి. ఎఎంసిలో సీనియర్లు భారీ ఊరేగింపు సన్నాహాలు జరుపుతున్నారు. జూనియర్లమైన మాకు ఇంకా బెరుకు పోలేదు. అయినా గానీ స్వచ్ఛందంగా మేమంతా ఆనాటి ఊరేగింపులో పాల్గొన్నాం. సీనియర్లు మా భుజాలపై చేతులేస్తూ మమ్ములను ప్రోత్సహిస్తూ తమతో పాటే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహపరిచారు. కింగ్ జార్జి హాస్పిటల్ కొండ దిగువున డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ వద్దకు విద్యార్థులంతా చేరుకున్నారు. ఇది డాక్టర్ల ఊరేగింపు అనడానికి చిహ్నంగా ఒకరు వైద్యుల గుర్తు (Doctores Sign)రెడ్ క్రాస్‌ను ఒక పెద్ద అట్టపై అతికించి ప్లకార్డుగా ప్రదర్శించారు. మువ్వన్నెల పతాక రెపరెపల కింద మేమంతా ఉత్సాహంగా ఉరకలెత్తాం. డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ నుంచి పోస్ట్ ఆఫీసు, కురుపాం మార్కెట్, పూర్ణా మార్కెట్, టర్నర్ చౌల్ట్రీ, వాల్తేరు రోడ్ మీదుగా సాగింది. టర్నర్ చౌల్ట్రీ వద్ద ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు. వాటిల్లో ఒకటి నేను చెరగని జ్ఞాపకంగా పదిలపరచుకున్నాను. మూడు గంటల పాటు ఏక బిగిన నడిచినా ఎవరి ముఖంలోనూ అలసట ఛాయలేదు.


బానిసత్వమేమిటో, స్వాతంత్ర్య మేమిటో తెలిసీ తెలియని వయస్సులో ఉన్నప్పటికీ చుట్టూ ఏర్పడిన ఆనంద హేల మాలో ఒక విధమైన భావోద్వేగాన్ని రేపింది. ఊరేగింపు అనంతరం కళాశాల ఆవరణలో సభ జరిగింది. ఎఎంసి విద్యార్థులు అందరమూ యూనిఫారం దుస్తులలోనే హాజరయ్యాం. వేదిక వద్ద ఎగరేసిన జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించాం. జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యే అరుదైన క్షణాల్లో ఇది అపురూపమైనది ఆనాటి ఆనందభరిత వేడుకల్లో పాల్గొన్నానన్న జ్ఞాపకం గుర్తుకు రాగానే నా ఒళ్లు గగుర్పొడుస్తుంది.


ఇది జరిగి దాదాపుగా 67 ఏళ్లు కావస్తున్నా ... ఆ కేరింతలు, సహ విద్యార్థులతో చేసిన నినాదాలు.. ఊరేగిన రహదార్లు అన్నీ కళ్ల ముందు కదలాడతాయి. మేము చేరిన నెల్లాళ్లకే స్వాతంత్ర్యం రావడంతో మా మెడికోలకు స్వతంత్ర బ్యాచ్ (Independence Batch)గా గుర్తింపు వచ్చింది. ఒక ప్రత్యేక గౌరవం కూడా కాలేజీలో లభించింది.’


జైహింద్

Updated Date - 2022-08-12T09:13:34+05:30 IST