బ్రిటీష్‌ వారిపై శివమెత్తిన రామరాజు

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

స్వాతంత్ర్యోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో బ్రిటీష్‌ వారిపై వేగేశ్న శివ రామరాజు శివమెత్తారు.

బ్రిటీష్‌ వారిపై శివమెత్తిన రామరాజు

మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర


భీమవరం, ఆగస్టు 13: స్వాతంత్ర్యోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో బ్రిటీష్‌ వారిపై వేగేశ్న శివ రామరాజు శివమెత్తారు. ఆంధ్రా ప్రజల్లో మరింత చైతన్యం పెంచడానికి మహాత్మాగాంధీ 1929లో ప్రారంభించిన ఖద్దరు నిధి సేకరణ యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం వచ్చారు.  ఏప్రిల్‌ 25 ఉదయం తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరి పిప్పర మీదుగా చిరుజల్లుల్లోనే గణపవరం చేరుకుని, నాటి పాటిదిబ్బలు, నేటి స్త్రీ సమాజం ప్రాంతం నుంచి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రోజున గణపవరం గ్రామ ప్రజలంతా కలిసి  ఖద్దరు నిధి కోసం సేకరించిన 401 రూపాయలను గాంధీజీకి అం దజేశారు. ఈ పర్యటనలో యువకుడైన వేగేశ్న శివరామరాజు, అతని చిన్నాన్న వేగేశ్న జోగిరాజు కుమారుడు వేగేశ్న బలరామరాజు, తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ అక్కడి నుంచి ఉండిలో రహదారి బంగళా వద్ద ఎనిమిది వేల మందిని ఉద్దేశించి ప్రసంగించి, ఆకివీడు చేరి ఖద్దరు ధారణ, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, నూలు ఒడకడంపై ఉపన్యసించి ఐదు న్నర గంటలకు బయలుదేరి రాత్రికి భీమవరం చేరుకున్నారు. వేగేశ్న శివరామరాజు ఆనాటి భీమవరం తాలూకా గణపవరం గ్రామ మునసబు వేగేశ్న సుబ్బరాజు, తల్లి భీమవరం కనుమూరి వారి ఆడపడుచు.. బంగారమ్మ గారికి ముగ్గురు కుమార్తెలు, నలుగురు కుమారులలో రెండో వానిగా 1905లో జన్మించి తెలుగు, సంస్కృత భాషలతోపాటు ఆనాటి గ్రామీణ జీవన విధా నం ప్రకారం కావాల్సిన లౌకిక విద్య వారి గ్రామంలోనే నేర్చుకున్నారు. గాంధీజీ స్ఫూర్తితో శివరామరాజు తన జీవితాన్ని స్వాతంత్య్ర ఉద్యమానికి పూర్తిగా అంకితమిచ్చారు. 1930లో మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో మార్చిలో సర్ధార్‌ దండు నారాయణరాజు, ఆత్మ కూరి గోవిందాచార్యులు నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా నాగిడిపాలెంలో ఉప్పు తయారీకై బయలుదేరిన జైత్రయాత్ర ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం మీదుగా గణపవరం చేరుకుంది. ఆ ఉద్యమకారులను వేగేశ్న శివరామరాజు, వేగేశ్న బలరామరాజు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి స్వాగతించి మాధవ రైస్‌మిల్‌లో వారికి విడిది ఏర్పాటు చేశారు. రైసు మిల్‌ యజమాని కొల్లేపర అచ్యుతం ఆధ్వర్యంలో స్వాతం త్య్ర ఉద్యమకారులకు భోజన, వసతి సదుపాయాలు సమకూర్చారు. అందులో శివరామరాజు ప్రధాన పాత్రధారుడిగా ఉద్యమకారులతో కలిసి పాల్గొన్నారు.
1930 మేలో గాంధీజీ నుంచి వచ్చిన ఆదేశాలతో ఉప్పు తయారీ నిలిపివేసి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భీమవరం లో జిల్లా కాంగ్రెస్‌ సభ్యుడు పాలకోడేటి వీర్రాజు, భూపతిరాజు పుల్లంరాజు తదితరులతో కలిసి నగర వీధులలో నగర సంకీర్తనం చేస్తూ జాతీయోద్యమ గీతాలు, నినాదాలతో ఊరేగింపు జరపగా 1930 జూలై 4న శుక్రవారం వీరి ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిని భీమవరం సబ్‌ డివిజనల్‌ 2వ తరగతి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా సెక్షన్‌ 17(1) సీఆర్‌ ఎల్‌, ల్యాండ్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం వీరికి ఒక్కొక్కరికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడి నుంచి 1930 జూలై 30న పది మంది స్వాతంత్య్ర సమరయోధులను రైలులో ఇప్పటి కర్ణాటక బళ్లారి ప్రాంతంలోని అల్లిపురం కారాగారానికి తరలించారు. అక్కడ జైలులో ఇచ్చిన అపరిపక్వమైన ఆహారాన్ని తీసుకుంటూ.. జుగుప్సాకరమైన వాతావరణంలో ఆయన అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఆయన సోదరుడు బలరామరాజు జైలుశిక్ష అనుభవించి మరణించారు. ఆయన గుర్తుగా తరువాతి కాలంలో తన చిన్నకుమారునికి వారి పేరు పెట్టు కున్నారు. వేగేశ్న శివరామరాజుగారి సహధర్మచారిణి సత్యవతమ్మ వారి ఇద్దరు కుమారులు వేగేశ్న గణపతిరాజు, వేగేశ్న బలరామరామరాజులను తీర్చిదిద్ది కుటుంబ బాధ్యతలను చూసుకోవడం వల్ల రాజు క్రియాశీలంగా ఉండి జైలు నుంచి విడుదలై తరువాత జాతీయవాదిగా 1940 సంవత్సరం వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో, 1942 సంవత్సరం క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని తనదైన పాత్ర పోషించారు.

వినోబాభావేతో కలిసి..


స్వాతంత్య్రం అనంతరం 1957లో సర్వోదయ నాయకులు ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదాన ఉద్యమంలో భాగంగా నాటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, సర్వోదయ నాయకులు మాజీ మంత్రి విద్యా ప్రదాత అయిన చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన సర్వోదయ పాదయాత్రలో కూడా పాల్గొని వినోబాభావేను కలిశారు. 1961 ఏప్రిల్‌లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో జరిగిన జాతీయ స్వరోదయ సమ్మేళనంలో కూడా ప్రధాన కార్యకర్తగా సేవలందించారు. 1972 సంవత్సరంలో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఉమ్మడి ఏపీలోని తాడేపల్లిగూడెం తాలుకా గణపవరం సమితిలోగల గణపవరంలో ఆనాటి కాంగ్రెస్‌ నాయకులు అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ ఆధ్వర్యం లో ఆగస్టు 15న స్వాతంత్య్ర సమరయోధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో వేగేశ్న శివరామరాజును అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీచే పంపిన తామ్రపత్రం బహుకరించారు.
దీని సందర్భంగా నాటి సమితిలో గల స్వాతంత్య్ర సమరయోధుల పేర్లుతో ఆవిష్కరించిన శిలా ఫలకాన్ని నేటికి గ్రామీణ సమితి ఆఫీస్‌ ప్రాంగణంలో చూడవచ్చు. తన 86వ ఏట 16 మార్చి 1991లో మరణించారు. 1996 సంవత్సరం డిసెంబర్‌లో ఆయన ధర్మపత్ని మరణించారు.  

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST