స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం

ABN , First Publish Date - 2022-08-16T05:52:10+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం

స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగిద్దాం
మహబూబాబాద్‌లో పోలీసులతో గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌, మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా తెలంగాణ

సీఎం కేసీఆర్‌ పాలనలో సమగ్రాభివృద్ధి 

వైద్య ఆరోగ్యం, విద్యారంగానికి పెద్ద పీట

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్‌ 

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు 

రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌


మహబూబాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది త్యాగాలతో దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిందని, వారి త్యాగాలు స్మరించకుంటూ సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, తద్వారా సమగ్రాభివృద్ధి చెంది దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. విద్య, ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని వివరించారు. మానుకోటలోని 100 పడకల జిల్లా ఆస్పత్రిని 330 పడకల వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేసి మెడికల్‌ కళాశాల, అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. కొవిడ్‌ నియ్రంతణలో భాగంగా 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. మన ఊరు- మన బడి ద్వారా జిల్లాలోని 316 పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు. 


అన్నదాతకు అండగా ప్రభుత్వం..

ఆరుకాలం కష్టపడి పని చేసి అందరికి అన్నంపెట్టే అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలస్తుందని మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. రైతు బందు ద్వారా పెట్టబడి సాయంగా 1.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.198.22 కోట్లు వేసినట్లు చెప్పారు. 2018లో రైతు బీమా పథకం పెట్టి ఏ కారణం చేతనైనా మృతి చెందిన రైతు కుటుంబాలకు తక్షణమే భీమా రూ.5 లక్షల సాయం అందిస్తున్నట్లు వివరించారు. రైతు వేదికలను ఏర్పాటు చేసిపంట సాగుపై చర్చించడంతో పాటు అవగాహన కల్పిస్తు న్నామని పేర్కొన్నారు. పల్లెప్రగతిలో జిల్లాలోని 461 గ్రామపం చాయతీ, పట్టణ ప్రగతిలో నాలుగు మునిసిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారిం చామని వివరించారు. హరితహారంలో ఉపాధి హామీ పథకం కింద 43.77 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 30.53 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.


మహిళాభ్యున్నతికి రుణాలు..

మహిళాభ్యున్నతికి కోసం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 11,827 సంఘాలకు రూ.412.12కోట్ల రుణాలు లక్ష్యం ఉండగా, 2054 గ్రూపులకు గాను రూ.100కోట్లు అందించామని చెప్పారు. స్త్రీ నిధి ద్వారా రూ.20.77 కోట్ల రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 1437 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికహారం అందిస్తున్నట్లు తెలిపారు. సఖీ కేంద్రం ద్వారా స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసలు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి అవసరమైన సహాయ సహాకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. దళిత బంధు పథకం జిల్లాలో 305 మంది లబ్ధిదారులకు ప్రతీ కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.30కోట్ల 50 లక్షల మంజూరి చేసినట్లు వివరించారు.


జిల్లా అభివృద్ధికి నిధులు..

గిరిజన జిల్లా మానుకోట అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. మానుకోట అంటే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రేమ అని ఈ ప్రాంత అభివృద్ధిపై నిరంతరం చర్చిస్తారని తెలిపారు. ఈప్రాంత బిడ్డగా జిల్లా అభివృద్ధికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి ప్రజలు సహకరిస్తూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉత్తమ అవార్డు గ్రహితలకు ప్రశాంసా పత్రాలను అందించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ వి. వెంకట్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, జిల్లా అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌, ఎం. డేవిడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:52:10+05:30 IST