బ్రిటన్‌లో భారత సంతతి మహిళ జైలుపాలు.. దురాశకు పోయి కోట్లు కూడబెట్టిందంటూ జడ్జి ఆగ్రహం..!

ABN , First Publish Date - 2022-07-10T00:41:28+05:30 IST

ఇతరుల స్థానంలో డ్రైవింగ్ లైసెన్స్(Driving license) పరీక్షకు హాజరైన నేరంపై ఓ భారత సంతతి మహిళకు బ్రిటన్‌లో జైలు శిక్ష పడింది.

బ్రిటన్‌లో భారత సంతతి మహిళ జైలుపాలు.. దురాశకు పోయి కోట్లు కూడబెట్టిందంటూ జడ్జి ఆగ్రహం..!

ఎన్నారై డెస్క్: ఇతరుల స్థానంలో డ్రైవింగ్ లైసెన్స్(Driving license) పరీక్షకు హాజరైన నేరంలో ఓ భారత సంతతి మహిళకు బ్రిటన్‌లో జైలు శిక్ష పడింది. ఆమెకు ఎనిమిది నెలల కారాగార శిక్ష విధించిన న్యాయమూర్తి.. నిందితురాలు దురాశకు పోయి తప్పు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్స్‌కు(wales) చెందిన 29 ఏళ్ల ఇందర్‌జీత్ కౌర్(Inderjeet kaur).. ఇంగ్లీష్ చదవడం రాయడం రాని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు అడ్డదారులు తొక్కింది. లండన్, బర్మింగ్‌హమ్ తదితర ప్రాంతాల్లో 150కి పైగా థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షల్లో అసలు అభ్యర్థులకు బదులు తాను హాజరయ్యింది. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి ఒక పరీక్షకు 800 పౌండ్లు( సుమారు రూ. 76 వేలు) చొప్పున తీసుకునేది. ఇటీవల ఇందర్‌జీత్ ఇలాగే ఓ పరీక్షకు వెళ్లగా అక్కడి సిబ్బందికి అనుమానం రావడంతో ఆమె బండారం మొత్తం బయటపడింది. 


డ్రైవర్ అండ్ వెహికిల్ స్టాండర్డ్స్ ఏజెన్సీ(DVSA) అధికారులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తాను నేరం చేసినట్టు నిందితురాలు అంగీకరించడంతో కోర్టు ఆమెకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఇందర్‌జీత్ కౌర్ నేరాల కారణంగా అమాయక వాహనదారులు ప్రమాదంలో పడ్డారంటూ న్యాయమూర్తి ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ పథకంగా ద్వారా నిందితురాలు ఇప్పటికే కోట్లు కూడ బెట్టి ఉండొచ్చని కామెంట్ చేశారు. ఆమె దురాశ ఏ స్థాయిలో ఉందో ఈ దర్యాప్తు బయటపెట్టిందన్నారు. ‘‘డ్రైవింగ్‌లో సరైన నైపుణ్యాలున్న వారికే లైసెన్సులు ఇచ్చేందుకు థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అడ్డదారుల్లో లైసెన్స్ పొందిన వారు రోడ్లు మీదకు వస్తే అమాయక ప్రజలు ప్రమాదంలో పడతారు’’ అంటూ న్యాయమూర్తి చెప్పారు. ఇక..ఇందర్‌జీత్ కౌర్ సాయంతో డ్రైవింగ్ పరీక్ష పాసైన వారందరూ త్వరలో తమ లైసెన్సులు కోల్పోనున్నారు. 

Updated Date - 2022-07-10T00:41:28+05:30 IST