క్వాడ్‌పై చైనా విమర్శలను కొట్టిపారేసిన భారత్, ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2022-02-12T20:04:10+05:30 IST

క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) లక్ష్యం ఘర్షణలను రెచ్చగొట్టడమేనని

క్వాడ్‌పై చైనా విమర్శలను కొట్టిపారేసిన భారత్, ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్ : క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) లక్ష్యం ఘర్షణలను రెచ్చగొట్టడమేనని చైనా చేసిన విమర్శలను భారత్, ఆస్ట్రేలియా శనివారం తోసిపుచ్చాయి. ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరాసే పయ్నే సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ, క్వాడ్‌ దేశాలకు సకారాత్మక లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. క్వాడ్ ఏ ఇతర దేశానికీ వ్యతిరేకం కాదన్నారు.


ఇండో-పసిఫిక్ రీజియన్‌లోని దేశాలు నిర్బంధం, బెదిరింపులు వంటివాటి ముప్పును ఎదుర్కొనవలసిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ఉండేవిధంగా శాంతి, సుస్థిరతలను కాపాడటమే క్వాడ్ లక్ష్యమని తెలిపారు.  కోవిడ్-19 వ్యాక్సిన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సముద్రంలో భద్రత వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 


పయ్నేతో సమావేశంలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితి ప్రస్తావనకు వచ్చిందా? అని ప్రశ్నించినపుడు జైశంకర్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో దళాలను పెద్ద ఎత్తున మోహరించరాదని చెప్తున్న లిఖితపూర్వక ఒప్పందాలను చైనా పట్టించుకోలేదని, ఈ కారణంగానే ఎల్ఏసీ వెంబడి లడఖ్ సెక్టర్‌లో చైనాతో ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పారు. 


చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ శుక్రవారం క్వాడ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అమెరికా ఆధిపత్యం కొనసాగడం కోసం చైనాను అదుపులో ఉంచడానికి క్వాడ్ ఓ సాధనమని ఆరోపించింది. ఘర్షణలను రెచ్చగొట్టి, అంతర్జాతీయ సంఘీభావం, సహకారాలను మరుగుపరచడమే దీని లక్ష్యమని మండిపడింది. 


ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్బంధాల నుంచి విముక్తి చేయడం కోసం సహకారాన్ని విస్తరించుకోవాలని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎస్ జైశంకర్ (భారత్), ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), యొషిమస హయషి (జపాన్), మరిసె పయ్నే (ఆస్ట్రేలియా) పాల్గొన్నారు. వీరు ‘నిర్బంధం’ అనే పదాన్ని ఉపయోగించడం వెనుక తనకు సందేశం ఇవ్వాలన్న లక్ష్యం ఉందని చైనా భావిస్తోంది. చైనాకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అనేక దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. క్వాడ్ ప్రారంభమైనప్పటి నుంచి దానిని చైనా వ్యతిరేకిస్తోంది. 


చైనా విమర్శలపై జైశంకర్ స్పందిస్తూ, ‘‘మా రికార్డు, మా చర్యలు, వైఖరులు చాలా స్పష్టంగా ఉన్నాయి. పదే పదే విమర్శించడం ద్వారా మమ్మల్ని అంతగా నమ్మదగినవారు కాదనే స్థాయికి తగ్గించలేర’’న్నారు. 


పయ్నే మాట్లాడుతూ, క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. నమ్మకం, కోలుకునే సత్తాలను నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి నిర్బంధాలు, బెదిరింపులు లేనటువంటి ప్రాంతాన్ని, తమకు సార్వభౌమాధికారం, భద్రత ఉన్నాయని భరోసాగా ఉండగలిగే పరిస్థితిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమకు వాస్తవంగా ఆచరణ సాధ్యమైన ఎజెండా ఉందన్నారు. వ్యాక్సిన్లకు సహకరించడంలో తమ ఎజెండాను చూడవచ్చునన్నారు. టీకాకరణపై క్వాడ్ నేతల వాగ్దానం ప్రకారం సుమారు 500 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను అందజేసినట్లు చెప్పారు. 


Updated Date - 2022-02-12T20:04:10+05:30 IST