India, Pakistan క్రికెటర్ల సంపాదనలో ఇంత తేడానా..? ఏడాదికి ఓ పాక్ క్రికెటర్‌కు రూ.52 లక్షలు.. మరి మనోళ్లకు ఎంతో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-20T06:43:47+05:30 IST

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు టీ20 ప్రపంచకప్ వచ్చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో..

India, Pakistan క్రికెటర్ల సంపాదనలో ఇంత తేడానా..? ఏడాదికి ఓ పాక్ క్రికెటర్‌కు రూ.52 లక్షలు.. మరి మనోళ్లకు ఎంతో తెలిస్తే..

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు టీ20 ప్రపంచకప్ వచ్చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఈ నెల 24న తొలి మ్యాచ్‌లో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌ గురించే ఇప్పుడు చర్చంతా. దాదాపు 28 నెలల తర్వాత ఈ రెండు జట్లూ తలపడబోతుండడం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇరు జట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అదే ఇరు జట్ల ఆటగాళ్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు చెల్లిస్తున్న జీతాల వివరాలు.


క్రికెట్ ప్రపంచాన్ని తన మునివేళ్లపై ఆడించగల బీసీసీఐ భారత ఆటగాళ్లకు కోట్లకు కోట్లు ఇస్తుంటే.. మరో పక్క పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఆ జట్టు ఆటగాళ్లకు లక్షల్లో ఇచ్చేందుకు కూడా వెనకాడుతోంది. ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డు సంక్షోభంలో ఉంది. ఈ మధ్యనే పాకిస్తాన్‌తో టోర్నీ ఆడేందుకు ఆ దేశం వెళ్లిన న్యూజిల్యాండ్.. భ్రదతా కారణాల దృష్ట్యా టోర్నీ ఆడకుండానే వెనుదిరగడం పాక్ క్రికెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్ర నష్టంలో కూరుకుపోయింది. దీని ప్రభావం పాక్ క్రికెటర్లు పొందే శాలరీపై కూడా తీవ్రంగా పడింది. గత కొంతకాలంగా వారి జీతాల్లో పెరుగుదలే లేకుండా పోయింది. అయితే తాజాగా టీ20 క్రికెట్ ప్రపంచకప్‌నకు ముందు పాక్ ఆటగాళ్ల జీతాలను కొద్దిగా పెంచుతున్నట్లు పీసీబీ ప్రకటించింది.


పాక్ క్రికెట్ బోర్డు కూడా భారత క్రికెట్ బోర్డు లానే ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఈ కాంట్రాక్టు ప్రకారం.. ఏ గ్రేడ్ పొందిన ఆటగాళ్లకు ఏడాదికి 1 కోటి 20 లక్షల పాకిస్తానీ రూపియాలు ఇస్తుంది. అంటే మన కరెన్సీలో రూ.52 లక్షలన్నమాట. అయితే ఈ జీతాలను భారత క్రికెటర్ల జీతాలతో పోల్చి చూస్తే మతిపోతుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్ పొందిన ఆటగాడికి ఏడాదికి రూ.7 కోట్లు జీతంగా అందుతాయి.


ఆటగాళ్లకు అందించే మ్యాచ్ ఫీజుల్లో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేరువేరుగా అందిస్తుంది. టెస్ట్ మ్యాచ్‌కు 3.5 లక్షల రుపియాలు, వన్డేకు 2.2 లక్షల రుపియాలు, టీ20 మ్యాచ్‌కు కేవలం 1 లక్ష రుపియాలు మాత్రమే అందుతాయి. ఇదంతా ఏ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి. ఇక ఎవరైనా ఆటగాళ్లు సీ గ్రేడ్‌లో ఉంటే ఆటగాళ్లకు లభించే మొత్తం.. మన దేశంలో దేశవాళీలు ఆడుకునే ఆటగాళ్లకు అందించే మ్యాచ్ ఫీజుకన్నా తక్కువగా ఉంటుంది.


అదే భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఆటగాళ్లకు టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు మ్యాచ్ పీజుగా అందుతుంది. ఇవి కాకుండా ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వారికి బోనస్‌లు కూడా లభిస్తాయి. ఎవరైనా డబుల్ సెంచరీ కొడితే వారికి అదనంగా రూ.7 లక్షల బోనస్ లభిస్తుంది. ఒకవేళ సెంచరీ చేస్తే రూ.5 లక్షలు లభిస్తాయి. అలాగే బౌలర్ల విషయంలో ఎవరైనా బౌలర్ 5 వికెట్లు తీస్తే.. వారికి కూడా ఇలాంటి బోనస్‌లే లభిస్తాయి. అందువల్ల ఒక్కోసారి ఒక్క మ్యాచ్‌లోనే రూ.25లక్షలు అందుకున్నభారత ఆటగాళ్లు కూడా ఉన్నారు.


ఈ మ్యాచ్ ఫీజుల వివరాలు తెలిసిన తర్వాత పాక్ ఆటగాళ్లపై జాలేస్తోంది కదూ. మరి ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా పాక్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లతో పోటాపోటీగా రాణించడం నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే ఎంత రాణించినా.. అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రం భారత్‌ను ఓడించడం పాక్‌కు కష్టంగానే ఉంది. మరి ఇంకో 4 రోజుల్లో జరిగే మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి.

Updated Date - 2021-10-20T06:43:47+05:30 IST