ఇండియా-పాకిస్థాన్.. మళ్లీ ఢీ!

ABN , First Publish Date - 2021-11-14T22:32:34+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరు కోసం ప్రపంచంలోని

ఇండియా-పాకిస్థాన్.. మళ్లీ ఢీ!

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరు కోసం ప్రపంచంలోని క్రికెట్ క్రీడాభిమానులు మొత్తం ఆసక్తిగా ఎదురుచూశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఏ స్థాయిలో మ్యాచ్ జరిగినా అది ఫైనల్‌ను తలపిస్తుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ కూడా అలాగే జరిగింది. అయితే, గత రికార్డులకు భిన్నంగా ఈసారి పాకిస్థాన్ జట్టు కోహ్లీ సేనపై విజయం సాధించి ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై పాక్ విజయం సాధించలేదన్న అపప్రదను తుడిచిపెట్టేసింది. 


భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు ఐసీసీ టోర్నీలలో తప్ప ముఖాముఖి తలపడడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు మరోమారు తలపడనున్నాయి. ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్, పాకిస్థాన్,  బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఈ టోర్నీలో ఈసారి హాంకాంగ్ కూడా అరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. 


నిజానికి ఈసారి ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పాకిస్థాన్‌దే అయినా, ఆ దేశంలోని పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధంతరంగా వెనక్కి వచ్చేయడం, ఇంగ్లండ్ కూడా సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో పాక్‌లో పర్యటించేందుకు ఇతర జట్లు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణ బాధ్యతను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శ్రీలంకకు అప్పగించింది. 2023 ఎడిషన్‌ను మాత్రం పాకిస్థాన్‌లో నిర్వహించనున్నట్టు ఏసీసీ పేర్కొంది.  

Updated Date - 2021-11-14T22:32:34+05:30 IST