Queen Elizabeth II : క్వీన్ గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినం

ABN , First Publish Date - 2022-09-09T21:44:03+05:30 IST

క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II ) గౌరవార్థం

Queen Elizabeth II : క్వీన్ గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినం

న్యూఢిల్లీ : క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II ) గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగాపాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆమె వృద్ధాప్య సమస్యలతో స్కాట్లాండ్‌లోని బల్మోరా కేజిల్‌లో గురువారం తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఆమె కుమారుడు చార్లెస్ ఆమె వద్ద ఉన్నారు. అయితే ఆమె పార్దివ దేహానికి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో అధికారికంగా వెల్లడించలేదు. 


96 సంవత్సరాల వయసులో క్వీన్ ఎలిజబెత్-2 పరమపదించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇచ్చిన సంతాప సందేశంలో, హెర్ మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్-2 మన కాలంలో అసాధారణ శక్తిసామర్థ్యాలుగల నేతగా గుర్తుండిపోతారని తెలిపారు. ఆమె తన దేశానికి, ప్రజలకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రజా జీవితంలో హుందాతనం, మర్యాదలకు ఆమె నిలువెత్తు రూపమని పేర్కొన్నారు. ఆమె మరణం తనను కలచివేసిందని చెప్పారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో,  హెర్ మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్ -2, యునైటెడ్ కింగ్‌డమ్, నార్తర్న్ ఐర్లాండ్ పరమపదించడంతో ఆమె గౌరవార్థం సెప్టెంబరు 11న జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు తెలిపింది. 


ఇదిలావుండగా, బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు పూర్తయిననాటి నుంచి ఏడు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తుంది. అయితే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో అధికారికంగా ప్రకటించలేదు. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం, ఆమె మరణించిననాటి నుంచి 11 రోజులకు అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. 


బకింగ్‌హాం ప్యాలెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) 1 గంటకు 96 రౌండ్లు పేల్చి క్వీన్‌కు  రాయల్ గన్ శాల్యూట్ చేస్తారు. క్వీన్ వయసు 96 సంవత్సరాలు కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రౌండ్ చొప్పున పేల్చి గన్ శాల్యూట్ చేస్తారు. 


Updated Date - 2022-09-09T21:44:03+05:30 IST