మాట నిలబెట్టుకున్నా

ABN , First Publish Date - 2022-08-15T10:45:32+05:30 IST

రెండు స్వర్ణాలతో భారత్‌ బాక్సింగ్‌ ఐకాన్‌గా మారిన నిజామాబాద్‌ అమ్మాయి నిఖత్‌ జరీన్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటోంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌..

మాట నిలబెట్టుకున్నా

(ఆంధ్రజ్యోతి  క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

రెండు స్వర్ణాలతో భారత్‌ బాక్సింగ్‌ ఐకాన్‌గా మారిన నిజామాబాద్‌ అమ్మాయి నిఖత్‌ జరీన్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటోంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌కు వెళ్లే ముందు తల్లికి పసిడి పతకాన్ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తానని వాగ్దానం చేసిన నిఖత్‌.. ఇచ్చిన మాట ప్రకారం తల్లి మెడలో ఆ స్వర్ణ హారాన్ని వేసి ఆమెను ఆనందడోలికల్లో ముంచెత్తింది. వచ్చే ఏడాది తన కెరీర్‌లో చాలా కీలకమంటున్న నిఖత్‌ ఆ విశేషాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...


అమ్మ మెడలో వేశా..: ఈనెల 3న అమ్మ పర్వీన్‌ సుల్తానా పుట్టినరోజు. నేను బర్మింగ్‌హామ్‌ చేరుకున్నాక బర్త్‌డే గిఫ్ట్‌ ఏం కావాలని అమ్మను అడిగా. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం నెగ్గి ఇంటికి తీసుకురా.. అదే నాకు నువ్వు ఇచ్చే గిఫ్ట్‌ అని అమ్మ చెప్పింది.గోల్డ్‌ మెడల్‌ గెలిచి నీ మెడలో వేస్తా అమ్మ అని ఆరోజు వాగ్దానం చేశా. ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి రాగానే అమ్మ మెడలో ఆ మెడల్‌ వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పా. ఆమె కళ్లల్లో ఆ ఆనందం చూడగానే పతకం గెలవడానికి నేను పడిన కష్టమంతా ఎగిరిపోయింది.


ఒత్తిడిని ఆస్వాదిస్తా..: వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పతకం నెగ్గాక నాపై అంచనాలు పెరిగాయి. కామన్వెల్త్‌లోనూ నేను స్వర్ణం అందుకోవాలని దేశం మొత్తం కోరుకుంది. దీంతో నాపై ఒత్తిడి పెరిగింది. అయితే, నాకు మొదటి నుంచి ఒత్తిడి ఆస్వాదించే అలవాటు ఉండడంతో నాకు అది బలమే అయింది కానీ, బలహీనతగా మారలేదు. అందుకే ఏ బౌట్‌లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 5-0తో ఓడిస్తూ ఫైనల్‌ చేరా. స్వర్ణ బౌట్‌లో పంచ్‌లు కురిపించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగా. అనుకున్నది సాధించా. 


విశ్రాంతి తీసుకోను..: మిషన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ పూర్తయ్యేదాకా విశ్రాంతి తీసుకోను. అక్టోబరులో ఆసియా చాంపియన్‌షి్‌ప, డిసెంబరులో జాతీయ చాంపియన్‌షి్‌ప ఉంది. ఇక, వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ముందు సంవత్సరమైనందున చాలా కీలకం. 


చాముండి చేయూత...

తెలంగాణ బ్యాడ్మింటన్‌ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌ ఆర్ధికంగా తనకెంతో చేయూత అందించారని నిఖత్‌ తెలిపింది. గతేడాది కిర్గిస్థాన్‌లో శిక్షణకు వెళ్లినపుడు రూ. 8 లక్షలు, మరోసారి రూ. 3 లక్షలు, ప్రాక్టీస్‌కోసం వెళ్లేందుకు బ్యాటరీ స్కూటర్‌, ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పతకం నెగ్గాక ఓ కారును కూడా బహూకరించారని నిఖత్‌ చెప్పింది.

Updated Date - 2022-08-15T10:45:32+05:30 IST