Sikh radicals : బ్రిటన్, కెనడా తీరును నిశితంగా గమనిస్తున్న భారత్

ABN , First Publish Date - 2022-09-21T18:48:45+05:30 IST

సిక్కు రాడికలైజేషన్ పెరుగుతుండటాన్ని భారత ప్రభుత్వం నిశితంగా

Sikh radicals : బ్రిటన్, కెనడా తీరును నిశితంగా గమనిస్తున్న భారత్

న్యూఢిల్లీ : సిక్కు రాడికలైజేషన్ పెరుగుతుండటాన్ని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బ్రిటన్, కెనడాలలో సిక్కు రాడికల్స్ హిందూ దేవాలయాలు, మతపరమైన చిహ్నాలపై దాడులు చేస్తున్నప్పటికీ ఆయా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం లేదని గుర్తించింది. రాడికల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలను దౌత్య మార్గాల్లో కోరుతోంది. 


సిక్కు రాడికలైజేషన్ పెరుగుతుండటాన్ని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బ్రిటన్, కెనడాల్లో హిందూ మత చిహ్నాలు, దేవాలయాలపై దాడులు జరుగుతుండటంపై సమీక్షిస్తోంది. ఈ రెండు దేశాలకు సూటిగా, పదునైన సందేశాన్ని పంపించేందుకుగల వివిధ అవకాశాలను పరిశీలిస్తోంది. 


బ్రిటన్‌లోని లీస్‌స్టెర్‌లో భారతీయులపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బ్రిటన్ అధికారులకు తన నిరసనను తెలియజేసింది. వేర్పాటువాద ఉద్యమాన్ని రగిలించేందుకు నిధులను సేకరిస్తున్నప్పటికీ, బ్రిటిష్ భద్రతా సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లు, ఉదాసీనంగా వ్యవహరిస్తుండటాన్ని మోదీ ప్రభుత్వం గమనిస్తోంది. దేనినీ తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించింది. ఈ రెండు కామన్వెల్త్ దేశాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించాలని నిర్ణయించింది. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతంలోనూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ తనకు లేని అంతర్జాతీయ స్థాయి పాత్రను తెచ్చుకోవడం కోసం బ్రిటన్ ప్రయత్నిస్తుండటం పట్ల భారత్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 


బ్రిటన్, కెనడాల్లో జరుగుతున్న పరిణామాలను విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామాల తీవ్రత పెరగడాన్నిబట్టి మన దేశం స్పందించబోతోంది. 


కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు (Justin Trudeau) రష్యా, భారత్‌ల విషయాల్లో పరస్పర విరుద్ధంగా స్పందిస్తుండటాన్ని భారత్ గమనిస్తోంది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో రిఫరెండమ్‌లను నిర్వహించాలని రష్యా ప్రతిపాదించినపుడు జస్టిన్ ట్రుడు గట్టిగా వ్యతిరేకించారు. కానీ నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for Justice) ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ ఒంటారియోలోని బ్రంప్టన్‌లో ఈ నెల 19న రిఫరెండం నిర్వహించడాన్ని ట్రుడు చూసీచూడనట్లు వదిలేశారు. ఈ చట్ట విరుద్ధ రిఫరెండంను ఆపాలని భారత ప్రభుత్వం మూడు డిప్లమేటిక్ మెసేజ్‌లను పంపించినా ట్రుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. 


ట్రుడు ప్రభుత్వం స్పందిస్తూ, కెనడాలో వ్యక్తులకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. శాంతియుతంగా, చట్టబద్ధంగా తమ భావాలను వ్యక్తం చేసుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపింది. ఒంటారియోలోని బ్రంప్టన్‌లో స్వామినారాయణ్ మందిరాన్ని అపవిత్రం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. 


బ్రిటన్, కెనడా, అమెరికా సిక్ రాడికల్ మువ్‌మెంట్‌కు కేంద్రాలవుతున్నాయి. పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఈ మూడు దేశాలకు ఇప్పటికే ఓ విషయాన్ని స్పష్టం చేసింది. అదేమిటంటే, భారత వ్యతిరేక సిక్కు రాడికల్స్‌పై చర్య తీసుకోకపోవడమంటే, వారికి నేరంలో సహకరించడంతో సమానమని చెప్పింది. 


Updated Date - 2022-09-21T18:48:45+05:30 IST