అల్‌ఖైదా పిలుపుపై భారత్ గుర్రు

ABN , First Publish Date - 2021-09-03T15:46:28+05:30 IST

ఇస్లామిక్ భూములకు విముక్తి కల్పించేందుకు ప్రపంచ యుద్ధం

అల్‌ఖైదా పిలుపుపై భారత్ గుర్రు

న్యూఢిల్లీ : ఇస్లామిక్ భూములకు విముక్తి కల్పించేందుకు ప్రపంచ యుద్ధం (గ్లోబల్ జీహాద్)కు అల్‌ఖైదా పిలుపునివ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్లోబల్ జీహాద్ కోసం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కశ్మీరును ప్రస్తావించి, చెచెన్యా, జింజియాంగ్‌లను వదిలిపెట్టడం వల్ల అల్‌ఖైదాతో పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి సంబంధాలు ఉన్నాయని వెల్లడవుతోందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ఈ విషయాన్ని జాతీయ మీడియాకు తెలిపాయి. 


అల్‌ఖైదా ఇచ్చిన ప్రకటనలో, ‘‘ఇస్లాంకు శత్రువుల కబంధ హస్తాల నుంచి లేవంట్, సోమాలియా, యెమెన్, కశ్మీరు, ఇతర ఇస్లామిక్ భూములను విముక్తి చేయండి. ఓ అల్లా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ఇవ్వు’’ అని పిలుపునిచ్చింది. ఈ గ్లోబల్ జీహాద్ పిలుపులో రష్యాలోని చెచెన్యా, చైనాలోని జింజియాంగ్ లేవు. 


ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నందుకు తాలిబన్లను అల్‌ఖైదా అభినందించింది. తాలిబన్లకు ప్రాధాన్యతాంశాల్లో కశ్మీరు అంతకుముందు ఉండేది కాదు. తాజాగా అల్‌ఖైదా విడుదల చేసిన ప్రకటననుబట్టి ఈ ఉగ్రవాద సంస్థతో పాకిస్థాన్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు తేటతెల్లమవుతున్నాయని భారత భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ ప్రకటన లక్ష్యం పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను భారత దేశంపై దాడులకు ప్రోత్సహించడమేనని అన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల పట్ల భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలోని ముస్లింలను రాడికలైజ్ చేయడానికి అల్‌ఖైదా ప్రయత్నిస్తోందని ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. పాకిస్థాన్ తన ఎజెండాను అల్‌ఖైదా ద్వారా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. 


అల్‌ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవహిరి తన నియంత్రణలోనే ఉన్నట్లు పాకిస్థాన్ బాహాటంగానే సంకేతాలు పంపిస్తోంది. తాలిబన్ సుప్రీం కమాండర్ హైబతుల్లా అకుండ్‌జాదా పాకిస్థాన్ ఐఎస్ఐ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. 



Updated Date - 2021-09-03T15:46:28+05:30 IST