Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌పై ఇస్లామిక్ నేషన్స్ గ్రూప్ వ్యాఖ్యలు... భారత్ ఆగ్రహం...

ABN , First Publish Date - 2022-05-28T20:33:54+05:30 IST

ఉగ్రవాదానికి నిధులను సమకూర్చుతున్నారనే ఆరోపణలు రుజువుకావడంతో

Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌పై ఇస్లామిక్ నేషన్స్ గ్రూప్ వ్యాఖ్యలు... భారత్ ఆగ్రహం...

న్యూఢిల్లీ : ఉగ్రవాదానికి నిధులను సమకూర్చుతున్నారనే ఆరోపణలు రుజువుకావడంతో ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు భారతీయ న్యాయస్థానం జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత దేశం మండిపడింది. ఈ తీర్పును విమర్శించడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తోందని పేర్కొంది. 


ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించవద్దని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్-ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (OIC-IPHRC)ను భారత దేశం కోరింది. ఈ జాఢ్యాన్ని ఎంత మాత్రం సహించరాదని ప్రపంచం కోరుతోందని తెలిపింది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, యాసిన్ మాలిక్ (Yasin Malik) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు న్యాయస్థానానికి వివరించామని చెప్పారు. మాలిక్‌కు శిక్ష విధిస్తూ స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై OIC-IPHRC చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బాగ్చి స్పందిస్తూ, యాసిన్ మాలిక్ కేసులో తీర్పు నేపథ్యంలో భారత దేశాన్ని విమర్శిస్తూ OIC-IPHRC చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా OIC-IPHRC పరోక్షంగా యాసిన్ మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలిపిందన్నారు. మాలిక్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిపే అన్ని ఆధారాలతో కూడిన పత్రాలను న్యాయస్థానానికి  సమర్పించినట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించకూడదని ప్రపంచం కోరుకుంటోందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నామని చెప్పారు. 


జమ్మూ-కశ్మీరు ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు టెర్రర్ ఫండింగ్ కేసులో యావజ్జీవ జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-05-28T20:33:54+05:30 IST