ACC U19 Asia Cup 2021: శ్రీలంక చిత్తు.. 8వసారి భారత్ సొంతమైన ఆసియా కప్!

ABN , First Publish Date - 2022-01-01T00:23:58+05:30 IST

అండర్-19 ఆసియాకప్‌లో అండర్-19 భారత జట్టు దుమ్మురేపింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో..

ACC U19 Asia Cup 2021: శ్రీలంక చిత్తు.. 8వసారి భారత్ సొంతమైన ఆసియా కప్!

దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టు దుమ్మురేపింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఎనిమిదోసారి సగర్వంగా ఆసియాకప్‌ను ముద్దాడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ అజేయంగా 56 పరుగులు, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 31 పరుగులు చేశారు. ఫలితంగా  శ్రీలంక నిర్దేశించి 102 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 21.3 ఓవర్లలోనే ఛేదించింది. 


అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక జట్టును 38 ఓవర్లలో 106 పరుగులకు కట్టడి చేశారు. విక్కీ ఓస్త్‌వాల్ మూడు వికెట్లు తీసి శ్రీలంకను దారుణంగా దెబ్బకొట్టాడు. కౌశల్ తాంబే 2 వికెట్లు తీసుకోగా, రాజ్‌వర్ధన్ హంగార్కర్, రవి కుమార్, రాజ్ బావా చెరో వికెట్ తీసుకున్నారు.


కాగా, వరుణుడు దాదాపు రెండు గంటలపాటు అడ్డుకోవడంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 102 పరుగులకు కుదించారు. భారత అండర్-19 జట్టు ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి. ఆసియాకప్‌ ఫైనల్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఓటమి ఎరుగని జట్టుగా భారత కుర్రాళ్ల జట్టు రికార్డులకెక్కింది.

Updated Date - 2022-01-01T00:23:58+05:30 IST