Modi in Japan : ఎలాంటి సవాలుకైనా భారత్ పరిష్కారం: మోదీ

ABN , First Publish Date - 2022-05-23T23:49:44+05:30 IST

అనేక సంవత్సరాల నుంచి జపాన్‌ (Japan)లో స్థిరపడినప్పటికీ

Modi in Japan : ఎలాంటి సవాలుకైనా భారత్ పరిష్కారం: మోదీ

టోక్యో : అనేక సంవత్సరాల నుంచి జపాన్‌ (Japan)లో స్థిరపడినప్పటికీ భారతీయులకు భారతీయ సంస్కృతి (Indian Culture) పట్ల అంకితభావం నిరంతరం వృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్‌లో పర్యటించిన ప్రతిసారీ తనకు గొప్ప ఆత్మీయత లభిస్తోందన్నారు. సోమవారం ఆయన జపాన్‌లోని భారత సంతతి (Indian diaspora) ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 


మోదీ జపాన్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. క్వాడ్ (Quadrilateral Security Dialogue) సదస్సులో పాల్గొనడంతోపాటు జపాన్ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో భారత సంతతి ప్రజలతో ఆయన సోమవారం మాట్లాడారు. 


గొప్ప ఆత్మీయత లభిస్తోంది

‘‘నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా, ఇక్కడి ప్రజల నుంచి గొప్ప ఆత్మీయతను పొందుతున్నాను. మీలో కొందరు అనేక సంవత్సరాల నుంచి జపాన్‌లో ఉంటున్నారు. ఈ దేశ సంస్కృతికి తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ, భారతీయ సంస్కృతి, భాష పట్ల అంకితభావం నిరంతరం వృద్ధి చెందుతున్నాయి’’ అని మోదీ అన్నారు. భారతీయులు తమ కర్మభూమి పట్ల మనసారా అనుబంధం ఏర్పరచుకుంటారని, అదే సమయంలో మాతృభూమి పట్ల ప్రేమను బలహీనపడనివ్వబోరని తెలిపారు. మనం మన జన్మభూమి నుంచి దూరం కాలేమన్నారు. ఇది మనకు గల గొప్ప బలాల్లో ఒకటి అని చెప్పారు.


జపాన్ పాత్ర

భారత్, జపాన్ సహజ భాగస్వాములని, భారత దేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించిందని తెలిపారు. జపాన్‌తో మన బంధం అత్యంత గాఢత, ఆధ్యాత్మికత, సహకారం, పరస్పర అనుబంధంతో కూడినదని వివరించారు. స్వామి వివేకానందుడు చికాగోలో చారిత్రక ప్రసంగం ఇవ్వడానికి వెళ్లే ముందు జపాన్‌ను సందర్శించారని, జపాన్‌ ఆయన మనసుపై గాఢమైన ముద్రను వేసిందని చెప్పారు. జపనీయుల దేశభక్తి, ఆత్మవిశ్వాసం, పరిశుభ్రత పట్ల అవగాహనలను అరమరికలు లేకుండా వివేకానందుడు ప్రశంసించారన్నారు. 


కోవిడ్ మహమ్మారి

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం 100 ఏళ్ళలో అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకుందన్నారు. అది మొదలైనపుడు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. దానికి టీకా వస్తుందో, రాదో తెలియదన్నారు. అలాంటి సమయంలో భారత దేశం ఇతర దేశాలకు మందులను పంపించిందన్నారు. 


బుద్ధుని ఆశీర్వాదాలు

గౌతమ బుద్ధుని ఆశీర్వాదాలు పొందడం భారత దేశ అదృష్టమని తెలిపారు. ఎంత పెద్ద సవాలుతో కూడుకున్న అంశంలోనైనా మానవాళికి భారత దేశం నిరంతరం సేవలందిస్తోందన్నారు. ఎటువంటి సవాలుకైనా భారత దేశం పరిష్కారాన్ని కనుగొంటుందన్నారు. కోవిడ్-19కు టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత దేశం ‘మేడ్ ఇన్ ఇండియా’ టీకాలను కోట్లాది మంది ప్రజలకు అందజేసిందన్నారు. అదేవిధంగా వాటిని 100కుపైగా దేశాలకు పంపించిందన్నారు. 


ప్రపంచం తెలుసుకుంటోంది

మౌలిక సదుపాయాలను, సామర్థ్యాన్ని భారత దేశం ఏ విధంగా, ఎంత వేగంతో పెంచుకుంటోందో ప్రపంచం తెలుసుకుంటోందని చెప్పారు. భారత దేశ సామర్థ్య నిర్మాణంలో జపాన్ ముఖ్య భాగస్వామి అని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్, ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉదాహరణలని తెలిపారు. 


అంతకుముందు మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. QUAD దేశాల గ్రూపులో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. 


Updated Date - 2022-05-23T23:49:44+05:30 IST