
విదేశాలకు మకాం మారుస్తున్న కుబేరులు
గోల్డెన్ వీసాలకు పెరుగుతున్న డిమాండ్
ఐదేళ్లలో పౌరసత్వం వదులుకున్న
6 లక్షల మంది భారతీయులు
న్యూఢిల్లీ: విదేశాలకు మకాం మారుస్తున్న దేశీ ధనికులు క్రమంగా పెరుగుతున్నారు. ఇతర దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు లేదా పౌరసత్వం పొందేందుకు గత ఏడాది భారత శ్రీమంతుల ఎంక్వైరీలు 2020తో పోలిస్తే 54 శాతం పెరిగాయని హెన్లీ అండ్ పార్ట్నర్స్ తాజా నివేదిక తెలిపింది. ఈ కంపెనీ విదేశీ నివాస, పౌరసత్వ ప్రణాళిక సేవలందిస్తుంటుంది. పరదేశంలో స్థిరపడేందుకు తమను సంప్రదిస్తోన్న ప్రపంచ సిరిమంతుల్లో భారత్, అమెరికా, బ్రిటన్ వాసులే అధికమని తెలిపింది.
ఐదేళ్లలో 6 లక్షలకు పైగా పౌరసత్వం వదులుకున్నారు..
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడచిన ఐదేళ్లలో మన దేశ పౌరసత్వం వదులుకున్నవారు 6 లక్షలకు పైమాటే. అందులో 40 శాతం మంది అమెరికాకు వలసపోయారు. ఈ ఆరు లక్షల మందిలో గోల్డెన్ వీసా ద్వారా పోర్చుగల్, మాల్టా, సైప్రస్ తదితర దేశాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. గడిచిన ఐదేళ్లలో అత్యధికంగా 2019లో 1,44,017 మంది భారత పౌరస త్వం వదులుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా 2020లో ఈ సంఖ్య 85,248కి తగ్గింది. 2021 సెప్టెంబరు నాటికే 111,287కు పెరిగింది. ఈ ఏడాదిలో మరింత పెరగవచ్చని రిపోర్టు అభిప్రాయపడింది. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు ప్రకారం.. 2020 సంవత్సరంలో 2 శాతం భారత మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు.
చలో యూరప్!
పెట్టుబడుల ద్వా రా వలసలకు భారత ధనికులు అధికంగా మొగ్గుచూపుతున్న దేశాల్లో పోర్చుగల్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, అమెరికా, మాల్టా, గ్రీస్ దేశాలు టాప్ 5లో నిలిచాయని హెన్లీ అండ్ పార్ట్నర్స్ రిపోర్టు వెల్లడించింది. స్పెయిన్, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తొలుత మనోళ్లు అమెరికా, కెనడాలో ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గుచూపేవారు. అయితే, సులభతరమైన ప్రక్రియతో తక్కువ పెట్టుబడికే వేగంగా రెసిడెన్స్ వీసాలు ఆఫర్ చేస్తుండటంతో గత కొన్నేళ్లుగా భారత సంపన్నుల్లో అధికమంది యూరప్ దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు నివేదిక పేర్కొంది. యూరప్ దేశాల్లో మలి దశ జీవితం గడపేందుకు, హాలీడే హోం ఏర్పాటుకు ఇండియన్ హై నెట్‌వర్త్ వ్యక్తులు, స్టార్ట్‌పల వ్యవస్థాపకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని కంపెనీ తెలిపింది.
స్థిరాస్తి రంగంలో కనీసం 2.80 లక్షల యూరోలు (దాదాపు రూ.2.35 కోట్లు) పెట్టుబడి పెట్టగలిగిన వారికి పోర్చుగల్ గోల్డెన్ రెసిడెన్స్ పర్మిట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ వీసా ద్వారా పోర్చుగల్‌లో జీవించడంతో పాటు అక్కడే పనిచేసుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా. అంతేకాదు, యూరోపియన్ స్కెంజెన్ పరిధిలోకి వచ్చే 26 దేశాల్లో వీసా అవసరం లేకుండా పర్యటించేందుకు వీలుంటుంది.
