Commonwealth Games 2022: పతకాల పంట పండించినా భారత్‌కు నిరాశే!

ABN , First Publish Date - 2022-08-09T03:12:20+05:30 IST

బర్మింగ్‌హామ్‌లో జులై 28న అట్టహాసంగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగిశాయి. ఈ గేమ్స్‌లో భారత క్రీడాకారులు

Commonwealth Games 2022: పతకాల పంట పండించినా భారత్‌కు నిరాశే!

న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్‌లో జులై 28న అట్టహాసంగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగిశాయి. ఈ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గేమ్స్ రెండో రోజు నుంచే పతకాల వేట ప్రారంభించిన క్రీడాకారులు చివరి రోజు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఘనంగా ముగించారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు గెలుచుకున్న భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఫలితంగా క్రీడల్లోనూ అగ్రదేశాలతో పోటీపడే సత్తా ఇండియాకు ఉందని భారత అథ్లెట్లు నిరూపించారు. అయితే, గత ఎడిషన్‌తో పోలిస్తే మాత్రం భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. 


2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 పతకాలు సాధించింది. ఇందులో 26  పసిడి పతకాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే టాప్ ప్లేస్‌లో నిలిచింది. 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలతో మొత్తంగా 198 పతకాలు గెలుచుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియాదే అగ్రస్థానం అయినా ఆ దేశ పతకాల సంఖ్య కూడా తగ్గింది. 67 స్వర్ణాలు, 57రజతాలు, 54 కాంస్య పతకాలు సాధించింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 57 స్వర్ణాలు సహా 176 పతకాలు సాధించిన ఇంగ్లండ్ రెండో స్థానంలోను, 26 స్వర్ణాలు సహా  92 పతకాలు సాధించిన కెనడా మూడో స్థానంలో నిలిచింది. 61 పతకాలతో భారత్ ఆ తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, గత ఎడిషన్‌లో కెనడాను వెనక్కి నెట్టేసిన భారత్ ఈసారి మాత్రం కెనడా తర్వాతి స్థానంలో నిలిచింది.


ఈసారి భారత్ పతకాలు తగ్గడానికి ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉంది. షూటింగులో ప్రతిసారి పతకాల పంట పండించింది. ఈసారి గేమ్స్‌లో షూటింగ్‌ లేకపోవడంతో భారత పతకాలు కొంత తగ్గాయని చెప్పొచ్చు. గత ఎడిషన్‌లో షూటింగులో భారత్‌కు 7 స్వర్ణాలు, 4 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు లభించాయి. గత ఎడిషన్‌లో భారత్  సాధించిన పతకాల్లో దాదాపు 25 శాతం షూటింగులోనే వచ్చాయి. ఈసారి పతకాల సంఖ్య తగ్గడానికి షూటింగ్ లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు.


1986లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన గేమ్స్ తప్ప 1974 ఎడిషన్ నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌లో భాగంగా ఉంటోంది. అయితే, లాజిస్టిక్ కారణాలతో బర్మింగ్‌హామ్ గేమ్స్ నుంచి షూటింగ్ క్రీడను తప్పించారు. ఈ గేమ్‌ను నిర్వహించేందుకు సరైన వేదిక లేకపోవడం వల్లే ఈసారి దీనిని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ తొలగించింది.  


2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అత్యధికంగా 101 పతకాలు సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన గేమ్స్‌లో 69, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో 66, 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 64 పతకాలు గెలుచుకున్న ఇండియా తాజాగా బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 61 పతకాలు సాధించింది. న్యూఢిల్లీ గేమ్స్‌లోనే భారత్‌కు అత్యధికంగా స్వర్ణ పతకాలు లభించాయి. ఆ గేమ్స్‌లో 38 పసిడి పతకాలు రాగా, మాంచెస్టర్‌లో 30, గోల్డ్‌కోస్ట్‌లో 26 వచ్చాయి. 2006 మెల్‌బోర్న్, 2022 బర్మింగ్‌హామ్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు 22 స్వర్ణ పతకాలు సాధించారు. బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో విజేతగా నిలిచి భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. పెడ్లర్ శరత్ కమల్ చివరి గోల్డ్ అందించాడు. బర్మింగ్‌హామ్ గేమ్స్‌ బ్యాడ్మింటన్ సింగిల్స్‌ ఫైనల్‌లో విజయం సాధించిన పీవీ సింధు అందుకున్న బంగారు పతకం.. కామన్వెల్త్ గేమ్స్‌లో 200వది కావడం విశేషం.

Updated Date - 2022-08-09T03:12:20+05:30 IST