Advertisement

పతన ప్రశస్తిలో భారత్!

Aug 15 2020 @ 01:38AM

ఒక జాతిగా మన ప్రస్తుత పతనానికి బీజాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండో ప్రభుత్వ హయాంలో పడినప్పటికీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచే అసలు నష్టం సంభవించింది. వివాదరహితమైన వాస్తవం ఒకటి వున్నది. అది: భారత్ ఒక అగ్రరాజ్యంగా రూపొందుతున్నదా అనే విషయమై మన స్వాతంత్ర్య వజ్రోత్సవం (2007 ఆగస్టు 15) సందర్భంగా చర్చించేందుకు కనీసం ఆస్కారమున్నది. పదమూడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు అటువంటి చర్చ పూర్తిగా ప్రహసనప్రాయమే అవుతుందనడంలో సందేహం లేదు. 


భారత్ ఎలా పురోగమిస్తోంది? మన స్వాతంత్ర్య వజ్రోత్సవం (2007 ఆగస్టు 15) సందర్భంగా ఆ ప్రశ్నను తర్కిస్తూ ఒక వ్యాసాన్ని రాశాను. అప్పట్లో, భారత్ అగ్రరాజ్యంగా ఆవిర్భవించనున్నదనే విషయమై మహోత్సాహంగా చర్చోపచర్చలు జరుగుతుండేవి. చైనా అప్పటికే అంతర్జాతీయంగా ఆ మేరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. ఇక భారత్ కూడా ఆ ప్రఖ్యాతిని సముపార్జించుకోనున్నదని పలువురు ఘంటా పథంగా అంటుండేవారు. ఇరవయో శతాబ్దిలో అమెరికా, 19వ శతాబ్దిలో గ్రేట్ బ్రిటన్ వలే 21వ శతాబ్దిలో ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలలో భారత్, చైనాల ప్రాబల్యం వహించనున్నాయనే వాదనలు బలంగా విన్పించేవి. 21వ శతాబ్దం ఆసియా శతాబ్ది అని రెట్టించి చెబుతుండేవారు. 


విశ్వవేదికలపై భారత్ వెలిగిపోయే తరుణం ఆసన్నమయిందని ముంబై, బెంగళూరులోని అధునాతన వాణిజ్య దిగ్గజాలు న్యూఢిల్లీలోని ఎడిటర్లు ప్రగాఢంగా విశ్వసించేవారు. స్వాతంత్ర్య వజ్రోత్సవానికి ముందు సంవత్సరం వీరు దావోస్ (ప్రపంచ ఆర్థిక వేదిక) సదస్సులో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి భారత్ ‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామిక వ్యవస్థ’ అని చాటి చెప్పారు. ఈ ప్రశంసలోని చివరి పదాన్ని చైనాను చమత్కారంగా వెక్కిరించేందుకే మన పెద్ద మనుషలు ఉద్దేశించారు. ప్రశాంతంగా నివశిస్తూ వృత్తి వ్యాపకాలు నిర్వహించుకునేందుకు, పెట్టిన పెట్టుబడులకు చక్కని ప్రతిఫలాలు పొందేందుకు భారత్ అన్ని విధాల సర్వోత్తమ సమాజమని అమెరికా, యూరోపియన్ కార్పొరేట్లకు చెప్పడమే ఆ ప్రశంస పరమార్థం.


పారిశ్రామిక వేత్తలు స్వభావ రీత్యా పరిపూర్ణ ఆశావాదులు. చరిత్రకారులు స్వతస్సిద్ధంగా సంశయవాదులు. ఈ వృత్తిశీల డి ఎన్ ఏ ఆధారంగా వజ్రోత్సవ భారత్‌పై నేను రాసిన వ్యాసంలో, ప్రపంచాధిపత్యాన్ని సాధించాలన్న మన ఆకాంక్షలు అవాస్తవికమైనవని స్పష్టం చేశాను. ఎందుకని? కుల మతాలు మన ఆలోచనలను, ఆచరణలను సంకుచితపరుస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మన రాజ్యాంగ, ప్రజాస్వామిక సంస్థలు సుదృఢంగా లేవు. పర్యావరణ వినాశనం సుస్థిర ఆర్థికాభివృద్ధిని అసాధ్యం చేస్తోంది. దావోస్లోనూ, ఇతరత్రా చెప్పిన కథలు భారత్లోని క్షేత్ర వాస్తవాలకు ఏమాత్రం అనుగుణంగా లేవు. మన దేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఆవిర్భవించబోవడం లేదని, అందుకు విరుద్ధంగా ఎప్పటిలాగానే ఒక వర్థమానదేశంగా ఉండిపోనున్నదని ముక్తాయిస్తూ నా వ్యాసాన్ని ముగించాను. పదమూడు సంవత్సరాల క్రితం నేను రాసిన దాన్ని మళ్ళీ చదివితే నిజానికి నేను అప్పట్లో అపరిమిత ఆశావాదిగా ఉన్నాననే భావన కలుగుతోంది! స్వాతంత్ర్య వజ్రోత్సవానికి ముందు సంవత్సరాలలో మన ఆర్థిక వ్యవస్థ, 8 శాతం వార్షిక వృద్ధిరేటుతో పురోగమించింది. కొవిడ్-19 విపత్తు వాటిల్లక ముందే మన ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిరేటు 4 శాతానికి పడిపోయింది. అది ఇప్పుడు పూర్తిగా అధో ముఖంలో ఉన్నది. అంతేకాదు, భారత్ గత కొద్ది సంవత్సరాలుగా ‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న ప్రజాస్వామిక దేశం’గా కూడా లేదు. కఠోర వాస్తవమేమిటంటే ‘ప్రజాస్వామిక దేశం’ అనే ప్రశస్తి అంతకంతకూ సందేహాస్పదంగా పరిణమిస్తోంది. మన ఆర్థికాభివృద్ధి మందగించింది. సక్రమంగా పనిచేస్తున్న ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్ను ఇంకెంత మాత్రం అభివర్ణించలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగ సంస్థలను తనకు అనుకూలంగా ఎలా లోబరచుకున్నదో ఇదే కాలమ్లో రాసిన వ్యాసాలలో పేర్కొన్నాను. 


2007లో భారత్ అగ్రరాజ్య ఆకాంక్షల గురించి గొప్పగా మాట్లాడిన వారిని హేళన చేశాను. నిజం చెప్పాలంటే అప్పట్లో నేనూ భారత్ గురించి గొప్పగా మాట్లాడేవాణ్ణి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి గాక, ఇతర అంశాలపై ప్రశంసించాను. భారత ప్రజాస్వామ్యాన్ని జాగరూకతతోను; సాంస్కృతిక మత బహుత్వవాదాన్ని సమృద్ధిగాను కొనియాడాను. ఒక సిక్కు ప్రధానమంత్రి చేత ఒక ముస్లిం రాష్ట్రపతి పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ఇది మన గణతంత్రరాజ్య సంస్థాపకుల ఆదర్శాలను రుజువు చేయలేదూ? 


2004, 2009 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ పరాజయాలు నాలాంటి ఉదారవాదులకు అమిత సంతృప్తి కలిగించాయి. అయితే ఆ పరాజయాల వల్ల హిందూత్వ భావజాల ప్రభావం క్షీణించలేదు. నరేంద్రమోదీ నేతృత్వంలో 2014 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సీట్లను కైవశం చేసుకున్నది. భారత ఆర్థిక వ్యవస్థను అధోగతిలోకి తోసివేసిన నోట్ల రద్దు (డిమానిటైజేషన్) అనే వినాశనకర ఆర్థిక ప్రయోగానికి మోదీ మొదటి ప్రభుత్వం గుర్తుండిపోతుంది. మోదీ రెండో ప్రభుత్వం తన మొదటి సంవత్సరంలో జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370ని రద్దు చేసింది; పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇవి రెండూ భారత బహుత్వ వాద సంస్కృతిని తీవ్రంగా దెబ్బ తీశాయి. రాబోయే సంవత్సరాలలో దేశ ఆర్థిక వ్యవస్థకు, మన సమాజానికి మోదీ, ఆయన ప్రభుత్వం ఎటువంటి ఉపద్రవాన్ని తీసుకువస్తాయో వేచి చూడాల్సిందే. 2007 ఆగస్టులో భారత్ గురించి ఆవిర్భవిస్తున్న అగ్రరాజ్యంగా మాట్లాడడం, బహుశా, తొందరపాటుతో కూడిన వ్యవహారమేనని చెప్పవచ్చు. అయినప్పటికీ ఒక ప్రశస్త ‘భారత్ కథ’ ఉన్నది. విశాల దేశం, అపార వైవిధ్యమున్న సమాజమే అయినా ఒక సమైక్య జాతీయ రాజ్యంగా రూపొందడంలో భారత్ సఫలమయింది. పితృస్వామిక వ్యవస్థ ప్రభావం బలీయంగా ఉన్నది; సంపూర్ణ అక్షరాస్య సమాజం కానేకాదు. అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో ఏకైక అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్ వెలుగొందుతోంది. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సార్వత్రక ఎన్నికలు క్రమబద్ధంగా జరగడం, ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలగడం ఒక అద్భుత విషయమే, సందేహం లేదు. శతాబ్దాల పాటు కరువు కాటకాలతో క్రుంగిపోయిన దేశం స్వాతంత్ర్యం తరువాత కోట్లాది ప్రజలను పేదరికం నుంచి విముక్తం చేయడమే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ లాంటి అధునాతన రంగాలలో అగ్రగామిగా ఉండడం విస్మరించలేని విశేషం. 2007లో భారత్ అగ్రరాజ్య హోదా గురించి గొప్పలు చెప్పుకోవడం తగని పని. అయితే స్వాతంత్ర్యం సాధించిన నాటినుంచి వివిధ రంగాలలో మనం సాధించిన గణనీయ విజయాలకు గర్వపడడం, బహుశా, పూర్తిగా సమర్థనీయమే.  ఇప్పుడు- 2020 ఆగస్టు- ప్రశస్త భారత్ కథ అనేది ఇంకెంత మాత్రం లేదు. కొవిడ్-19 మనపై విరుచుకుపడక ముందే మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడడం ప్రారంభమయింది. మన ప్రజాస్వామ్యం పూర్తిగా అవినీతిమయమైపోయిందని, అది క్రమంగా క్షీణించిపోతుందనే భావన విస్తృతంగా నెలకొన్నది. మైనారిటీలు తీవ్ర అభద్రతా భావంలో బతుకుతున్నారు. భారత పౌరులుగా తమ భవిష్యత్తు గురించి మున్నెన్నడూ లేనివిధంగా భయపడుతున్నారు. పారిశ్రామిక వేత్తలలో సైతం ఆశాభావం పూర్తిగా కొరవడింది. ఉదాసీనత వారిని ఆవహించింది. కొవిడ్ మహమ్మారి ఈ దుస్థితిని మరింత తీవ్రమూ, సంక్లిష్టమూ చేసింది. ప్రజల ఆర్థిక బాధలను ఇతోధికం చేసింది. సామాజిక చీలికలను ముమ్మరం చేసింది. ప్రజాస్వామిక లోటుపాట్లను మరింత తీవ్రం చేసింది. గతి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను పలు సంవత్సరాల తరువాత గానీ మళ్ళీ పట్టాల పైకి ఎక్కించడం సాధ్యంకాదు. 2014 నుంచి మన ప్రజాస్వామ్య సంస్థలకు, భారతీయ సమాజాన్ని సమున్నతంగా నిలిపిన బహుత్వవాద విలువలకు ఎనలేని నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి మన ప్రజాస్వామ్యం, సమాజం ఎప్పటికి కోలుకుంటాయి? ఇది ఎంతో మందిని కలచివేస్తున్న ప్రశ్న.


ఒక జాతిగా మన ప్రశస్తి మసక బారడం ఎలా ఆరంభమయిందో, ఆ పతనానికి కారకులైన వ్యక్తులు ఎవరో, సంస్థల బాధ్యత ఏమేరకు ఉన్నదో సమగ్రంగా, సాధికారంగా అంచనా వేయవలసిన బాధ్యత భావి చరిత్రకారులపై ఉన్నది. నా సొంత అభిప్రాయమేమిటంటే మన ప్రస్తుత పతనానికి బీజాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండో ప్రభుత్వ హయాంలో పడ్డాయి. అయితే నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటినుంచే అసలు నష్టం సంభవించింది. వివాదరహితమైన వాస్తవం ఒకటి వున్నది. అది: భారత్ ఒక అగ్రరాజ్యంగా రూపొందుతున్నదా అనే విషయమై మన స్వాతంత్ర్య వజ్రోత్సవం (2007 ఆగస్టు 15) సందర్భంగా చర్చించేందుకు కనీసం ఆస్కారమున్నది. పదమూడు సంవత్సరాల అనంతరం ఇప్పుడు అటువంటి చర్చ పూర్తిగా ప్రహసనప్రాయమే అవుతుందనడంలో సందేహం లేదు.రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Follow Us on:
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.