మురిపించారు..

Jul 30 2021 @ 04:12AM

  • క్వార్టర్స్‌లో సింధు, పురుషుల హాకీ జట్టు
  • సతీశ్‌ పంచ్‌ అదుర్స్‌
  • అతాను గురి భేష్‌ 
  • మేరీ కోమ్‌ నిష్క్రమణ 

ఒలింపిక్స్‌ ఆరంభమైన మర్నాడే మీరాబాయి రజతానందంలో మునిగిన భారతావనికి ఆ తర్వాత అధికభాగం పరాజయ వార్తలే... కానీ గురువారం ఏడో రోజున మన అథ్లెట్లు విజయాలతో అదరగొట్టారు. స్వర్ణ ఆశలు మోస్తున్న పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది. గత వైభవం కోసం ఎదురుచూస్తున్న పురుషుల హాకీ డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ మెడల్‌కు మరో అడుగు దూరంలో నిలిచాడు. అయితే.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా ఖ్యాతికెక్కిన వెటరన్‌ మేరీ కోమ్‌ తన ఆఖరి ఒలింపిక్స్‌ను ఓటమితో ముగించింది.


టోక్యో: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు జోరు కొనసాగిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను 21-15, 21-13 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ధాటిగా ఆడిన సింధు ఈ మ్యాచ్‌ను 41 నిమిషాల్లోనే ముగించింది. తొలి గేమ్‌లో కాస్త తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. కానీ లోపాలను సరిదిద్దుకుంటూ రెండో గేమ్‌ ఆరంభంలోనే 5-0తో దూసుకెళ్లింది. అదే జోరును కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించింది. 


హైవోల్టేజ్‌ పోరుకు సింధు రెడీ

క్వార్టర్స్‌లో యమగూచితో అమీతుమీ


ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో హైవోల్టేజ్‌ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఐదో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌)తో 7వ ర్యాంకర్‌ పీవీ సింధు తలపడనుంది. గతంలో వీరిద్దరూ 18 సార్లు పోటీపడగా 11-7తో సింధుదే పైచేయి. సింధు, అకానెలిద్దరూ కసిగా తలపడేవారు కావడంతో.. నరాలు తెగే ఉత్కంఠ నెలకొనడం ఖాయం. కోర్టులో వేగంగా కదలడం యమగూచి ప్లస్‌ పాయింట్‌. కానీ, వెన్ను గాయం తర్వాత మునుపటి వేగం తన ఆటలో లోపించిందని స్వయంగా ఆమే చెబుతోంది. మరోవైపు పొడగరి అయిన సింధు.. కచ్చితమైన క్రాస్‌ కోర్టు షాట్‌లు, అటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలా యిస్తుంటుంది. కానీ, డిఫెన్స్‌లో భారత షట్లర్‌ బలహీనత బహిర్గతమవుతుంది. అయితే, తీవ్ర సాధన, సరికొత్త టెక్నిక్‌లతో లోపాలను సరిదిద్దుకున్నానని చెబుతున్న సింధు.. విజయంపై ధీమా గా ఉంది. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు మంచి మజాను పంచే అవకాశముంది.


హాకీ

పురుషుల హాకీ జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తమ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనాను 3-1తో కంగుతినిపించింది. 43వ నిమిషంలో తొలి గోల్‌ను వరుణ్‌ కుమార్‌ సాధించాడు. వివేక్‌ (58), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (59) మిగతా గోల్స్‌ చేశారు. ఈ గ్రూప్‌లో భారత్‌ మూడు విజయాలతో  నాకౌట్‌కు చేరింది.


ఆర్చరీ

పురుషుల వ్యక్తిగత 1/16 ఎలిమినేషన్‌లో అతాను దాస్‌ అదరగొట్టాడు. కొరియా ఆర్చర్‌ జిన్యెక్‌ హోపై 6-5తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ఐదు సెట్ల పాటు జరిగిన ఈ పోరులో ఇద్దరూ నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డారు. దీంతో ఇరువురికీ 5-5తో సమాన పాయింట్లు లభించాయి. అయితే షూటా్‌ఫలో అతాను పర్‌ఫెక్ట్‌ 10 సాధించడం, హో 9తో వెనకబడడం లాభించింది. అంతకుముందు తొలి ఎలిమినేషన్‌లో డెంగ్‌ యు చెంగ్‌ (చైనీస్‌ తైపీ)ని 6-4తో దాస్‌ ఓడించాడు.షూటింగ్‌

మహిళల 25మీ. పిస్టల్‌ ప్రెసిషన్‌ క్వాలిఫికేషన్‌లో మనూ బాకర్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రాహీ సర్నోబాత్‌ 25వ స్థానంలో నిలిచింది.


రోయింగ్‌

లైట్‌ వెయిట్‌ పురుషుల డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌-బిలో అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ ఐదో స్థానంలో నిలిచారు.


సెయిలింగ్‌

పురుషుల స్కిఫ్‌ 49ఇఆర్‌లో గణపతి-వరుణ్‌ ఐదో రేసులో 16, ఆరో రేసులో ఏడో స్థానంలో నిలిచారు. ఇక పురుషుల లేజర్‌లో విష్ణు శరవణన్‌కు ఏడో రేసులో 27, ఎనిమిదో రేసులో 20వ స్థానం రాగా.. మహిళల లేజర్‌ రేడియల్‌లో నేత్రా కుమనన్‌ ఏడో రేసులో 22, ఎనిమిదో రేసులో 20వ స్థానంలో నిలిచింది.


గోల్ఫ్‌

పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే తొలి రౌండ్‌లో అనిర్బన్‌ లాహిరి 67 పాయింట్లతో టీ8 సాధించగా.. ఉదయన్‌ మానె 76 పాయింట్లతో చివరి స్థానం (60)లో నిలిచాడు. 


స్విమ్మింగ్‌

స్విమ్మింగ్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. 100మీ. బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో  సజన్‌ ప్రకాశ్‌ సెమీ్‌సకు అర్హత సాధించలేకపోయాడు. తన హీట్స్‌లో 53.45సె. టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 55 మందిలో తొలి 16 మందే సెమీస్‌కు వెళ్లే అవకాశముండగా సజన్‌ 46వ స్థానంలో నిలిచి తిరుగుముఖం పట్టాడు. 

బాక్సింగ్‌

పురుషుల హెవీవెయిట్‌ +91 కేజీ విభాగంలో బాక్సర్‌ సతీశ్‌ కుమార్‌ 4-1తో రికార్డో బ్రౌన్‌ (జమైకా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే తదుపరి బౌట్‌లో అతడికి ప్రపంచ చాంపియన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) ఎదురుకానున్నాడు. 


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.