UK PM race: తెరపైకి మరో భారతీయురాలి పేరు.. ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

ABN , First Publish Date - 2022-07-08T20:05:05+05:30 IST

వరుస వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని పీఠాన్ని బోరిస్​ జాన్సన్ (Boris Johnson)​ వీడారు.

UK PM race: తెరపైకి మరో భారతీయురాలి పేరు.. ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

లండన్: వరుస వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని పీఠాన్ని బోరిస్​ జాన్సన్ (Boris Johnson)​ వీడారు. సొంత పార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత.. మంత్రుల వరుస రాజీనామాల ఒత్తిళ్లతో తలొగ్గిన బోరిస్​ జాన్సన్​ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాని ఎవరనే దానిపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్​ నారాయణ మూర్తి అల్లుడు, భారత మూలాలున్న బ్రిటన్​ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్​ (Rishi Sunak) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనతో పాటు తాజాగా మరో భారత సంతతి మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే సుయేల్లా బ్రేవర్మాన్ (Suella Braverman).


ప్రస్తుతం ఆమె యూకే కేబినెట్‌లో అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్నారు. 42 ఏళ్ల ఈ న్యాయవాది ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సీనియర్ చట్టపరమైన అధికారి కూడా. బ్రేవర్మాన్ మాట్లాడుతూ.. 2019 నాటి ప్రభుత్వ మేనిఫెస్టోను ప్రస్తావించారు. ఆ మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. అందుకే తాను ముందుకు వస్తున్నానని, అందులో బ్రెగ్జిట్ అవకాశాలను కూడా పొందుపరచాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాన సమస్యలను చక్కదిద్దాలని, పన్నులను తగ్గించాలని కోరుకుంటున్నానని బ్రేవర్మాన్ అన్నారు. కాగా, బ్రేవర్మాన్ పేరెంట్స్ గోవాకు చెందిన వారని తెలుస్తోంది.  


ఇక వీరితో పాటు కన్జర్వేటివ్‌ పార్టీలోని మరో ఎనిమిది మంది పేర్లు ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి బెన్‌వాలెస్, లిజ్‌ ట్రస్‌, పెన్నీ మార్డాంట్‌, జెరిమీ హంట్‌, నదీమ్‌ జహావీ తదితరుల పేర్ల పైనా బెట్టింగులు నడుస్తున్నాయి. అయితే, వీరందరిలోనూ రిషి సునక్‌ (42) ముందంజలో ఉన్నారు. ఇక రిషి సునక్‌ గానీ, బ్రేవర్మాన్ గానీ యూకే ప్రధాని అయితే మాత్రం ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రకెక్కుతారు. అంతేకాదు.. భారతదేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా దాస్యశృంఖలాలతో బందించిన దేశ ప్రధాని బాధ్యతలు ఒక భారత సంతతి వ్యక్తి చేతికి రావడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం. 

Updated Date - 2022-07-08T20:05:05+05:30 IST