అపాయంలో బాల భారతం

Dec 4 2021 @ 00:49AM

ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తులు- బాలలే. వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని అసర్–2021, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అ దుస్థితిపై పార్లమెంటులో కానీ, ప్రజా వేదికలపై గానీ ఎలాంటి చర్చ జరగడం లేదు! బాలల సంక్షేమ సాధనకు ప్రత్యేకంగా ఏర్పాటైన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా గాఢ నిద్రలో ఉంది. 


ఏంమాట్లాడుతున్నారు? పాకిస్థాన్ నుంచి ముప్పు, పరోక్ష బెదిరింపులు చేస్తున్న చైనా, హిందూత్వ, సాఫీగా సాగని పార్లమెంటు, ఆందోళన్ జీవీ (నిత్య నిరసనకారులు), కుటుంబ పెత్తనంలో రాజకీయ పార్టీలు, ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యంలో కానరాని అభివృద్ధి, విశ్వగురువుగా భారత్.... కేంద్ర ప్రభుత్వం, దాని మంత్రులు ఎడతెగకుండా మాట్లాడుతున్నది ఈ అంశాల గురించే కదూ? విసుగెత్తిపోయేలా మరీ మరీ మాట్లాడుతున్నారు. వినలేక ఇక వినలేక చిరాకు కలుగుతోంది.


ఈ కొవిడ్ కాలంలో ఎక్కడకు పారిపోగలం? నిజానికి వారు మాట్లాడవలసింది ఆ అంశాల గురించి మాత్రమేనా? కాదు. మన బాలల పరిస్థితినే తీసుకోండి. ఎంత దైన్యస్థితిలో వాన్నరు వాళ్లు! మరి వాళ్ల గురించి పాలకులు ఎందుకు మాట్లాడరు? మన బాలల ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా వారి విద్యా వ్యాసంగాలు ఎలా సాగుతున్నాయి? ఈ అత్యవసర అంశాలపై మహారాజశ్రీ ప్రభుత్వ ప్రతినిధులు ఎందుకు మాట్లాడరు? ఏటా ప్రచురితమవుయ్యే ‘వార్షిక విద్యాస్థితి నివేదిక’ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ -(అసర్))ను నేను శ్రద్ధగా చదువుతుంటాను. ఈ ఏడాది అసర్ నివేదిక గత నెల 17న ప్రచురితమయింది. ఇప్పుడది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది. అసర్ నివేదిక ప్రచురితమైన సమయంలోనే 2019–21 సంవత్సరాలకు సంబంధించిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5’ (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–-5) నివేదిక కూడా ప్రచురితమయింది. ఈ సర్వే కూడా ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–-4 పద్ధతుల్లోనే జరిగింది. అసర్ -2021, ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–-5 నివేదికలు రెండూ వర్తమాన భారతదేశపు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదిక కూడా పక్షం రోజులుగా ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది. మరి ప్రధానమంత్రి గానీ, విద్యామంత్రి గానీ, ఆరోగ్యమంత్రి గానీ ఆ రెండు నివేదికలు ఎత్తి చూపిన వాస్తవాల గురించి ఎందుకు 

మాట్లాడడం లేదు? 


దేశ విద్యా వైద్య రంగాలపై కొవిడ్ చూపిన విలయ వినాశకర ప్రభావాన్ని ఆ రెండు నివేదికలూ అంచనా వేశాయి. ఆ మూల్యాంకనాలను కొట్టివేయడానికి వీలులేదు. ఆ రెండు నివేదికలు వెల్లడించిన వాస్తవాలు మనల్ని నైరాశ్యంలో ముంచెత్తివేస్తాయి. అవేమిటో క్లుప్తంగా పేర్కొంటాను. తొలుత అసర్–2021 నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తాను. అవి: 


(1) పాఠశాల ప్రవేశాలలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రైవేట్ బడులలో కంటే ప్రభుత్వ పాఠశాలలోనే చేరికలు ఇతోధికంగా పెరిగాయి. (2) పిల్లలు ‘ట్యూషన్’ చెప్పించుకునే ధోరణి గణనీయంగా పెరిగింది. 


(3) స్మార్ట్ ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే పిల్లలకు వాటి అందుబాటు ఇంకా ఒక సమస్యగానే ఉంది. (4) పాఠశాలలు పునఃప్రారంభమవుతుండగా ఇంటి వద్ద చదువులో సహాయపడడమనేది గణనీయంగా తగ్గిపోయింది. బాలలకు అధ్యయన సామగ్రి అందుబాటులో ఉండడం స్వల్పంగా పెరిగింది. ఇక ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌–5 నివేదిక వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. (1) మొత్తం జననాల రేటు 2.0కి చేరింది. అయితే మూడు పేద రాష్ట్రాల జనాభా అంతకు మించిన రేటుతో పెరుగుతోంది. (2) గత ఐదు సంవత్సరాలలో జన్మించిన బాలల్లో బాల బాలికల నిష్పత్తి పడిపోయింది. ప్రతి 1000 మంది మగ శిశువులకు 929 మంది ఆడ శిశువులే జన్మించారు. (3) లక్షలాది కుటుంబాలకు పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఇంధనం, ఆరోగ్య సమస్యలు ఇంకా సవాలుగానే ఉన్నాయి. 

(4) మరణాల రేటు పడిపోయింది. అయితే ఆమోదయోగ్యం కాని రీతిలో అధికస్థాయిలో ఉంది. (5) బాలల్లో పెరుగుదల స్తంభించిపోవడం, రక్తహీనత మొదలైనవి తీవ్రస్థాయిలో హెచ్చుతున్నాయి. 


విద్యా వైద్య రంగాలకు సంబంధించిన ఈ రెండు నివేదికలను తులనాత్మకంగా చూడండి. ఏం అర్థమవుతోంది? ఏ దేశానికైనా అత్యంత విలువైన వనరు బాలలు- నిర్లక్ష్యానికి గురవుతున్నారని విశదమవుతోంది. అయినా అ విషయమై పార్లమెంటులో కానీ, ప్రజావేదికలపై గానీ ఎలాంటి చర్చ జరగడం లేదు! బాలల సంక్షేమ సాధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా గాఢనిద్రలో ఉంది. 


ఆయా దేశాల ప్రజల్లో వివిధ వర్గాల వారి మధ్య అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆదాయం, సంపదలో వ్యత్యాసాలు అధికంగా ఉండడం కద్దు. మనదేశంలో కుల మత వైషమ్యాల మూలంగా ఆ సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు మరింత తీవ్రమవుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాల వారిలోని పేదలు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పెరిగిపోతోంది. మౌలిక సంక్షేమమే ఇలా ఉంటే వారి పిల్లల విషయంలో ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.


అసర్, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వేలు కుల, మత ప్రాతిపదికన జరగలేదు. అవి బాలల జీవన స్థితిగతుల గురించిన అధ్యయనాలు. కొవిడ్ విలయం వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ఆ నివేదికలు స్పష్టం చేశాయి. ప్రతి కుటుంబంలోనూ పిల్లల సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే పురుష, మహిళా శిశువుల మధ్య నిష్పత్తి గతంలో ఆరోగ్యకరంగా ఉండేది. అయితే గత ఐదేళ్ళలో ఆ నిష్పత్తి 1020 నుంచి 929కి తగ్గిపోయింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. పేద రాష్ట్రాలలో పాలన కూడ ప్రజాహితంగా ఉండడం లేదు. జనాభా పెరిగిపోతున్న కొద్దీ ఆ మూడు రాష్ట్రాలలో పేదరికమూ విపరీతంగా పెరిగిపోతోంది; బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన కొనసాగుతూనే ఉంది. ఇదొక చేదు వాస్తవం. స్వచ్ఛభారత్‌ను సాధించేందుకు ఇంకా చాల దూరం ప్రయాణం చేయవలసి ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీన్నే ఇప్పుడు ఉజ్వలగా పిలుస్తున్నారు) ప్రభుత్వం చెప్పుకుంటున్న స్థాయిలో విజయవంతం కాలేదు. 


నవజాత శిశువుల మరణాల రేటు అధికంగా ఉండడం దేన్ని సూచిస్తుంది? బతికి బయటపడిన శిశువులు పోషకాహార లోపం సమస్య నెదుర్కొంటున్నారన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. వయస్సుకు తగ్గ విధంగా ఎదుగుదల లేని శిశువుల సంఖ్య ఇప్పటికీ 35శాతానికి పైగా ఉంది. 


2020–21లోనూ, 2021–22లోనూ బాలల చదువుకు సంభవించిన నష్టం అంతా ఇంతాకాదు. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటున 35 వారాలపాటు బడులు మూతపడగా మనదేశంలో ఏకంగా 73 వారాల పాటు మూతపడ్డాయి. ప్రైవేట్ బడులలోని బాలలు ప్రభుత్వ పాఠశాల్లో చేరడం పెరిగిపోతోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో వీరందరికీ స్థానం దక్కుతుందా అనేది సందేహమే. బాలలకు పాఠ్యపుస్తకాలు, ఇతర అధ్యయన సామగ్రి పూర్తిగా అందుబాటులో ఉండడం లేదు. విద్యావ్యవస్థలోని అవ్యవస్థత వల్ల అధికశాతం బాలల్లో ప్రాథమిక విద్యాకౌశలాలు కూడా కొరవడుతున్నాయని అసర్ నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మన బాలల ఆరోగ్య స్థితిగతులు, విద్యావసతుల దుస్థితి గురించి చిత్తశుద్ధితో ఆలోచిస్తాయా?

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.