Advertisement

వ్యవసాయాభివృద్ధిని నిలువరించే చట్టాలు

Oct 15 2020 @ 00:37AM

తాజాగా అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి ఇకపై ప్రభుత్వపరంగా ఎటువంటి అండ లభించదు. ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కనుమరుగవుతాయి. ప్రైవేటు వ్యాపారస్థులు ‘కార్టెల్‌’గా మారి ధర తగ్గించివేస్తే వారిని ప్రశ్నించేవారు, నియంత్రించేవారు ఉండరు. గతంలో మాదిరిగా రైతు సమస్యలపై ప్రతిపక్షాలు అసెంబ్లీలోనో, పార్లమెంట్‌లోనో ప్రభుత్వాలను నిలదీయలేవు. సభలను స్తంభింపజేసి కనీసం కొన్ని డిమాండ్లనైనా ప్రభుత్వంతో ఒప్పించగలిగే అవకాశం ఉండదు. రైతు ప్రతినిధులు, రైతు సంఘాల నాయకుల విన్నపాలు అరణ్యరోదనగా మారతాయి. రైతుల ఉత్పత్తులకు ఇకపై ధరలు నిర్ణయించేది ప్రైవేటు వ్యక్తులే. ధరల్నే కాక.. ఎంత పరిమాణంలో ఉత్పత్తుల్ని కొనాలో కూడా దళారులే నిర్ణయిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే రైతాంగం భవిష్యత్తు వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుంది.


వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట మోదీ ప్రభుత్వం తాజాగా తెచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆగ్రహజ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. స్వాతంత్య్రం లభించే నాటికి భారతదేశంలో తిండిగింజలకు తీవ్రమైన కొరత ఉండేది. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు ఆహారం దొరకని గడ్డు పరిస్థితి. ఆ స్థితి నుంచి బయటపడి కేవలం రెండు దశాబ్దాల వ్యవధిలోనే హరితవిప్లవం సాధించిన ఘనత మన రైతాంగానిది, వారిని ప్రోత్సహించిన నాటి ప్రభుత్వాలది. ప్రతి ఏటా కరువులు, తుఫాన్లు ఎదురవుతున్నా, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమే కాక మిగులు ధాన్యాలను నిల్వ చేసుకునే స్థాయికి దేశ వ్యవసాయ రంగం చేరిందంటే- దానికి అనేక ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు ఎంతో దోహదం చేశాయి.


ముఖ్యంగా, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించేందుకు జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (కమిషన్‌ ఫర్‌ కాస్ట్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ప్రైసెస్‌ - సిఏసిపి)ను ఏర్పాటు చేయటంలో గత ప్రభుత్వాలు చొరవ తీసుకున్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చి పంటలు తడిచి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే, ప్రభుత్వ సంస్థలు అయిన మార్క్‌ఫెడ్, నాఫెడ్‌, సిసిఐ వంటివి వెంటనే రంగప్రవేశం చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటూ వచ్చాయి. దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన మండీలు, మార్కెట్‌యార్డులలోనే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకొనే సౌకర్యాలు అన్నిచోట్లా విస్తరించాయి. దశాబ్దాలుగా ఈ వ్యవస్థలు రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. అయితే మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. రైతులు కరువుతోనో, అధిక వర్షాలతోనో పంటలు నష్టపోతే, ఇకపై వాటిని కొనుగోలు చేసే యంత్రాంగం దేశంలో కనుమరుగైపోతుంది.


దేశంలో 60 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేముందు రైతుసంఘాలను పిలిచి వారితో సమావేశమై సూచనలు, సలహాలు తీసుకోవడం కేంద్రప్రభుత్వ కనీస బాధ్యత. అయితే, అటువంటి సంప్రదాయాలను పాటించే ఒరవడి ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా పని చేసిన వ్యవస్థలను ధ్వంసం చేయడమే ఏన్డీఏ ఏకైక ఎజెండాగా చేసుకుంది. ఆ క్రమంలోనే మూడు వ్యవసాయ చట్టాలను నియంతృత్వ ధోరణిలో దేశ రైతాంగంపై రుద్దింది. దేశ ప్రజలందరూ కరోనాపై భయాందోళనలతో సతమతమవుతున్న సమయంలో జూన్‌ మాసంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో హడావిడిగా ఆ బిల్లులను ప్రవేశపెట్టి ఉభయ సభలలో కనీస చర్చకు కూడా అవకాశం కల్పించకుండా మూజువాణీ ఓటుతో ఆమోదింపచేసుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం వాదిస్తున్నట్లు ఈ మూడు చట్టాలు రైతులకు మేలు చేసేవే అయితే వీటిపై సమగ్రంగా పార్లమెంట్‌లో చర్చించడానికి ఎందుకు జంకినట్లు? ఆశ్చర్యం ఏమిటంటే, పార్లమెంట్‌లో చర్చ జరక్కుండా అడ్డుకున్న ప్రభుత్వం, కొంతమంది కేంద్ర మంత్రులను ఎంపిక చేసిన ప్రాంతాలకు పంపి, ఈ చట్టాలు రైతులకు ప్రయోజనం కలింగించేవేనని చెప్పిస్తున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ డొల్లతనానికి పరాకాష్ఠ. 


దేశంలో కేవలం రెండు ఎకరాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులు 12కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరు పండించిన ఉత్పత్తులను ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలిచ్చి కొనుగోలు చేస్తున్నాయి. కనీస మద్దతుధర కంటే అధికంగా ధర పలికినపుడు మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతారు. తాజాగా అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి ఇకపై ప్రభుత్వపరంగా ఎటువంటి అండ లభించదు. ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కనుమరుగవుతాయి. ప్రైవేటు వ్యాపారస్థులు ‘కార్టెల్‌’గా మారి ధర తగ్గించివేస్తే వారిని ప్రశ్నించేవారు, నియంత్రించేవారు ఉండరు. గతంలో మాదిరిగా రైతు సమస్యలపై ప్రతిపక్షాలు అసెంబ్లీలోనో, పార్లమెంట్‌లోనో ప్రభుత్వాలను నిలదీయలేవు. సభలను స్తంభింపజేసి కనీసం కొన్ని డిమాండ్లనైనా ప్రభుత్వంతో ఒప్పించగలిగే అవకాశం ఉండదు. రైతు ప్రతినిధులు, రైతు సంఘాల నాయకుల విన్నపాలు అరణ్యరోదనగా మారతాయి. రైతుల ఉత్పత్తులకు ఇకపై ధరలు నిర్ణయించేది ప్రైవేటు వ్యక్తులే. ధరలనే గాక, ఎంత పరిమాణంలో ఉత్పత్తుల్ని కొనాలో కూడా దళారులే నిర్ణయిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే రైతాంగం భవిష్యత్తు వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుంది.


రైతులు ఇకపై దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ చట్టాన్ని చేయడమే తమ ఘనతగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. రైతులు విధిగా మార్కెట్‌యార్డులు, మండీలలోనే తమ ఉత్పత్తుల్ని అమ్మాలనే నిబంధన ఇంతకుముందు కూడా లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో పని చేసే మార్కెట్‌యార్డులు, మండీలు లేకుంటే రైతులు ఎక్కడకు తీసుకెళ్ళి తమ ఉత్పత్తుల్ని అమ్మాలి? వ్యాపారులు నిర్ణయించే చోట్లకు రైతులు వెళ్లాల్సి ఉంటుంది. మరి వ్యాపారి రైతుకు కనీస మద్దతు ధర ఇస్తాడా? అనుమానమే! ఇందుకు ఉదాహరణ బిహార్‌ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్ల తంతు! బిహార్‌లో మార్కెట్‌ కమిటీల వ్యవస్థను 2006లో రద్దు చేశారు. అక్కడ ప్రైవేటు వ్యాపారులకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ ఏడాది బిహార్‌లో క్వింటాల్‌ వరి ధాన్యానికి వ్యాపారులు అందించిన ధర రూ.1200లు మాత్రమే. ఇది కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కంటే చాలా తక్కువ. అదే పంజాబ్‌ రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మండీలలో క్వింటాల్‌ ధాన్యం రూ.1900ల ధర పలికింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇది ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సేకరణలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేస్తే, బిహార్‌ రైతాంగంలా నష్టపోతామనే ఆందోళనతోనే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో రైతాంగం రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు మెరుగ్గా వస్తాయి కనుక బిహార్‌ రైతాంగం తమ ఉత్పత్తుల్ని పంజాబ్‌కు తీసుకెళ్లి అమ్మగలరా? కార్పొరేట్లు, వ్యాపారులు మాత్రమే రైతుల పంటలను కారుచౌకగా కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి లాభాలు గడించగలరు. 


మోదీ అధికారంలోకి వచ్చాక ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నియమించిన నీతి ఆయోగ్‌ 2015లోనే రైతుల ఆదాయాన్ని నాలుగున్నర సంవత్సరాలలో రెట్టింపు చేయడానికంటూ నాలుగు మార్గాలను ప్రకటించింది. అవి: 1) రైతులకు గిట్టుబాటు ధర అందించడానికి వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థను సంస్కరించడం 2) ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం 3) వ్యవసాయ భూముల విధానాన్ని ప్రక్షాళన గావించడం 4) ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకోవడం. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే పంటలన్నింటికి కనీస మద్దతు ధరలు అందించాలి. అదేవిధంగా.. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా పెరగాలి. అందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలి. కానీ, కీలకమైన పంటల ధరలను మార్కెట్‌ శక్తులకు అప్పజెప్పి దాంతోనే, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఎన్డీఏ ప్రభుత్వం నమ్మబలుకుతోంది.


గత ఆరేళ్ళలో మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేసిన ‘ఫసల్‌ బీమా యోజన’, మార్కెట్‌ కమిటీల ప్రక్షాళన తదితర పథకాలు ఆశించిన లక్ష్యాలు నెరవేర్చలేకపోయాయి. కేంద్రంలో 2004 నుంచి 2014 వరకు అధికారంలో వున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అమలు చేసిన చర్యలు (ప్రధానంగా మార్కెట్‌ యార్డులు, మండీల సంఖ్య పెంపుదల, రైతుల రుణమాఫీ, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌, రైతులకు న్యాయం చేసే భూసేకరణ చట్టం-2013 మొదలైనవి) వ్యవసాయరంగాన్ని గాడినపెట్టి సగటున 2.5శాతం వృద్ధిరేటు సాధించేలా చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తోంది. ఎన్డీఏ నిర్ణయాలు రైతులకు శాపాలుగా మారుతున్నాయి. కొత్తగా తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు కాబోతున్నాయి.


గిడుగు రుద్రరాజు

మాజీ ఎమ్మెల్సీ, ఏఐసిసి కార్యదర్శి 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.