Congress protest: భారత్ పోలీసు రాజ్యం, మోదీ కింగ్ : రాహుల్

ABN , First Publish Date - 2022-07-26T19:54:02+05:30 IST

''భారతదేశం పోలీసు రాజ్యం, దీనికి రాజు మోదీ. ఇదే నిజం'' అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు..

Congress protest: భారత్ పోలీసు రాజ్యం, మోదీ కింగ్ : రాహుల్

న్యూఢిల్లీ: ''భారతదేశం పోలీసు రాజ్యం, దీనికి రాజు మోదీ. ఇదే నిజం'' అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడంపై రాహుల్, పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.  పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ మంగళవారంనాడు నిరసన ప్రదర్శన జరిపారు. విజయ్ చౌక్ వద్ద  పోలీసులు రాహుల్ గాంధీని, ఇతర ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు. రాహుల్‌తో పాటు రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె.సురేష్ తదితరులను పోలీసు బస్సులో ఎక్కించి కింగ్స్ వే క్యాంపుకు తీసుకువెళ్లారు. అరెస్టుకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీలంతా ఇక్కడే ఉన్నారని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే కనీసం ఇక్కడ బైఠాయించేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదని అన్నారు. అక్కడ పార్లమెంటులో చర్చకు అనుమతించడం లేదనీ, ఇక్కడ అరెస్టులు చేస్తున్నారని వాపోయారు. తాము రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి మెమొరాండం ఇవ్వాలనుకున్నట్టు చెప్పారు.


దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ ఎంపీలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల ఆదేశాలకు అనుగుణంగానే తాము నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయడంపై మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల కుట్ర అని, విపక్షాలను నాశనం చేసి, వారి గొంతునొక్కాలని అనుకుంటున్నారని అన్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. దీపందర్ హుడా మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్,  కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై పార్లమెంటులో చర్చకు తాము డిమాండ్ చేశామని, ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. దీనిపై రాజ్‌ఘాట్ వద్ద నిరసన చేస్తామని చెప్పామని, అయితే అందుకు అనుమతించ లేదని, రాష్ట్రపతికి మెమొరాండం ఇస్తామని చెప్పినా దానికి కూడా అనుమతించ లేదని అన్నారు.


మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రెండో విడత విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముదు హాజరయ్యారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రను తోడుగా తీసుకుని ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈనెల 21న తొలి రౌండ్ విచారణలో భాగంగా రెండు గంటల సేపు సోనియాగాంధీ ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ అడిగిన 28 ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. కాగా, పార్టీ నాయకత్వాన్ని ఈడీ ప్రశ్నించడం రాజకీయ కక్షలో భాగమేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది.





Updated Date - 2022-07-26T19:54:02+05:30 IST