మే 7 తరువాత భారత్‌లో తొలిసారిగా.. కరోనా మూడో వేవ్‌కు ఇది సంకేతమా..

ABN , First Publish Date - 2021-08-03T02:26:31+05:30 IST

అంటువ్యాధుల వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో సూచించే సంఖ్యే ఆర్-ఫ్యాక్టర్. కరోనాకు సంబంధించి భారత్‌లో ఆర్-ఫ్యాక్టర్ తాజాగా ‘1’ మార్కును దాటింది.

మే 7 తరువాత భారత్‌లో తొలిసారిగా.. కరోనా మూడో వేవ్‌కు ఇది సంకేతమా..

న్యూఢిల్లీ: అంటువ్యాధుల వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో సూచించే సంఖ్యే ఆర్-ఫ్యాక్టర్. కరోనాకు సంబంధించి భారత్‌లో ఆర్-ఫ్యాక్టర్ తాజాగా ‘1’ మార్కును దాటింది. మే 7 తరువాత ఆర్-ఫ్యాక్టర్ పెరగడం ఇదే తొలిసారి. దీంతో..థర్డ్ వేవ్‌కి దీన్ని సంకేతకంగా భావించాలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాస్త్రీయ నిర్వచనం ప్రకారం.. సగటున ఓ రోగి నుంచి ఎంతమందికి వ్యాధి వ్యాపించిందనే విషయాన్ని ఆర్-ఫ్యాక్టర్ సూచిస్తుంది. ఆర్-ఫ్యాక్టర్ ఒకటికి చేరుకుందంటే.. సగటున ఓ రోగి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తోందని అర్థం. మహమ్మారులు ప్రబలిన సమయాల్లో ప్రభుత్వాలు.. దీన్ని 1కి లోపే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. కాగా.. ఆర్-ఫ్యాక్టర్ ‘1’ మార్కు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు కూడా అంగీకరించాయి. 


చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెన్ శాస్త్రవేత్త సితాభ్రా సిన్హా ఈ పరిస్థితిపై తాజాగా స్పందించారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..జులై 27న తొలిసారిగా ఆర్-ఫ్యాక్టర్ 1మార్కును దాటిందన్నారు. జూలై 27-31 మధ్య ఆర్-ఫ్యాక్టర్ సగటు 1.03గా ఉందని చెప్పారు. ‘‘ఈ పెరుగుదల తాత్కాలికమైనదే కావచ్చు. అయితే..అనేక రాష్ట్రాల్లో ఒకేసారి ఆర్-ఫ్యాక్టర్ సంఖ్య పెరుగుతోందంటే..ఇది వ్యవస్థాగత మార్పుల్ని సూచిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-03T02:26:31+05:30 IST