మళ్లీ 4 లక్షల కేసులు

ABN , First Publish Date - 2021-05-07T07:20:15+05:30 IST

ఒకదానివెనుక ఒకటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నా.. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నా దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు...

మళ్లీ 4 లక్షల కేసులు

  • కరోనాతో ఒక్క రోజే 3,980 మంది మృతి
  • కర్ణాటకలో 50 వేలు, కేరళలో 42 వేల కేసులు
  • కేరళ, రాజస్థాన్‌లో లాక్‌డౌన్‌.. గోవాలో ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌
  • కట్టడికి ఏం చేస్తున్నారు?
  • తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌ 
  • వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ కొరతపైనా ఆరా

న్యూఢిల్లీ, తిరువనంతపురం, మే 6: ఒకదానివెనుక ఒకటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నా.. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నా దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. నాలుగు రోజు లు తగ్గినట్లే తగ్గిన కొత్త కేసులు.. ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 4,12,262 మందికి పాజిటివ్‌ అని తేలింది. రికార్డు స్థాయిలో 3,980 మంది చనిపోయారు. శనివారం మరణాలు 3,500 మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్ర తర్వాత ఒక్క రోజులో 50 వేలకుమించి కేసులు నమోదైన రాష్ట్రంగా కర్ణాటక (50,112) నిలిచింది. కేరళ (41,953)లోనూ కరోనా తీవ్రమవుతోంది. కాగా, బుధవారం 19.23 లక్షల పరీక్షలు చేశారు. మహారాష్ట్ర (57,640), ఉత్తరప్రదేశ్‌ (31 వేలు), ఢిల్లీ (19 వేలు)లో వైరస్‌ వెనుకంజ వేసినట్లు కనిపిస్తున్నా.. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు (23 వేలు)తో పాటు పశ్చిమబెంగాల్‌ (18 వేలు)లో ఉధృతితో జాతీయ స్థాయిలో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో 20 రోజుల తర్వాత పాజిటివ్‌ రేటు 25 దిగువకు వచ్చింది. తాజా మరణాల్లో మహారాష్ట్రలోనే 920 ఉన్నాయి. యూపీ(353), కర్ణాటక(346), తమిళనాడు (167) సహా 13 రాష్ట్రాల్లో మృతుల సంఖ్య వందకుపైగా ఉంది.  కరోనా ఉధృతి నేపథ్యంలో 9 రోజులు లాక్‌డౌన్‌ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే లాక్‌డౌన్‌ 16వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కేరళలో ఇప్పటికే కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా 41,953 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.


రాజస్థాన్‌లో ఈ నెల 10 నుంచి 24 వరకు కఠిన ఆంక్షలతో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. పాజిటివ్‌ రేటు 18పైగా ఉంటుండటంతో.. మధ్యప్రదేశ్‌లో కరోనా కర్ఫ్యూను ఈ నెల 17 వరకు పొడిగించారు. ఢిల్లీలో ఏప్రిల్‌ 6న 3,291 కట్టడి ప్రాంతాలు ఉంటే.. ప్రస్తుతం 47,700కు చేరాయి. అంటే 1,349 శాతం పెరిగాయి. గోవాలో కొన్ని వారాలుగా పాజిటివ్‌ రేటు ఏకంగా 50గా ఉంది. దేశంలోనే ఇది అత్యధికం. అంటే.. పరీక్షించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ వస్తున్నట్లు లెక్క. ఢిల్లీలోని ఏపీ భవన్‌ డ్రైవర్‌ సంజయ్‌ గురువారం కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు లక్షణాలు కనిపించడంతో వైద్యాధికారిణి డాక్టర్‌ రమాదేవి ఆస్పత్రిలో చేరారు. 



తెలంగాణకు కొత్త టీకాలు సున్నా!

ఏపీకి 2.65 లక్షల వ్యాక్సిన్‌ డోసులు

వచ్చే మూడు రోజుల్లో కేంద్రం నుంచి తెలంగాణకు టీకాల కేటాయింపు లేదు. 18 రాష్ట్రాలు/యూటీలకు కేంద్రం 28,90,360 డోసులను పంపనుండగా.. ఆ జాబితాలో తెలంగాణ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు 2,65,360 టీకాలు కేటాయించారు. మరోవైపు అన్ని రాష్ట్రాలకు ఇప్పటివరకు 17.15 కోట్ల డోసులను ఇచ్చినట్లు కేంద్రం చెప్పింది. రాష్ట్రాల వద్ద మరో 89.31 లక్షల టీకాలు ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలో 4,38,832 డోసులు అందుబాటులో ఉండగా, ఏపీలో 48,126 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 


కట్టడికి ఏం చేస్తున్నారు? 

తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌ 

కరోనా ఉధృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. వైరస్‌ తీవ్రత, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. వ్యాక్సిన్‌ పంపిణీ తీరు, ఆక్సిజన్‌ కొరత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామని, బాధితులకు సంపూర్ణ వైద్య సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధానికి సీఎం జగన్‌ వివరించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతతో పాటు కట్టడి చర్యలపై ఇరువురూ చర్చించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. కాగా, కొవిడ్‌ పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఒడి శా, జార్ఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్ము-కశ్మీర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్లతోనూ మోదీ ఫో న్‌లో చర్చించారని పీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. 


టీకా ప్రక్రియ వేగవంతం: ప్రధాని

వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ గురువారం సమీక్షించారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే కొద్ది నెలల్లో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ప్రణాళికపైనా ఈ సమావేశంలో చర్చించారు. 45ఏళ్లు పైబడిన వారిలో 31శాతం మందికి తొలి డోసు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేశామన్నారు. కేంద్రమంత్రు లు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామ న్‌, హర్షవర్ధన్‌, పీయూష్‌ గోయల్‌ హాజరయ్యారు.

Updated Date - 2021-05-07T07:20:15+05:30 IST