Chinese Ship : చైనా వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చిన భారత్

ABN , First Publish Date - 2022-08-28T16:35:39+05:30 IST

భారత దేశం (India)పై చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలకు

Chinese Ship : చైనా వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చిన భారత్

కొలంబో : భారత దేశం (India)పై చైనా రాయబారి చేసిన వ్యాఖ్యలకు శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ (High Commission of India in Sri Lanka)  ఘాటుగా బదులిచ్చింది. శ్రీలంకకు ఇప్పుడు కావలసినది సహకారమని, వేరొక దేశపు ఎజెండాకు ఉపయోగపడే అవాంఛనీయ ఒత్తిడి, అనవసరమైన వివాదాలు కాదని తెలిపింది. ప్రాథమిక దౌత్య సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ చైనా రాయబారి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. 


చైనా తన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5)ను శ్రీలంకలోని హంబంటోటా (Hambantota) నౌకాశ్రయంలో నిలపడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నౌక మొదటి షెడ్యూలు ప్రకారం ఆగస్టు 11న ఈ నౌకాశ్రయానికి రావలసి ఉంది. అయితే భారత దేశం భద్రతాపరమైన ఆందోళన వ్యక్తం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నౌకాశ్రయాన్ని చైనాయే నిర్వహిస్తుండటంతోపాటు శ్రీలంకలోని ముఖ్య నేతలు కూడా ఒత్తిడి చేయడంతో ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వక తప్పలేదు. అయితే కొన్ని షరతులను విధించింది. శ్రీలంక ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో ఈ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచాన్ చేసి ఉంచాలని, శ్రీలంక జలాల్లో ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించరాదని తెలిపింది. ఆగస్టు 16 నుంచి 22 వరకు హంబంటోటా పోర్టులో ఈ నౌకను నిలిపేందుకు అనుమతి ఇచ్చింది. 


ఈ నౌకలోని ట్రాకింగ్ సిస్టమ్స్ భారత దేశ రక్షణ వ్యవస్థల సమాచారాన్ని రహస్యంగా తెలుసుకునే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలోని చైనా రాయబారి కీ ఝెంహోంగ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. యువాన్ వాంగ్ 5 నౌకకు సంబంధించిన అంశంలో చైనా, శ్రీలంక పరస్పర సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతలను ఉమ్మడిగా కాపాడుకోగలగడం సంతోషకరమని తెలిపారు. ఈ అంశాన్ని ఉమ్మడిగా చక్కదిద్దుకోవడం హర్షణీయమని అన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏదో భద్రతాపరమైన ఆందోళన ఉందంటూ, దాని ఆధారంగా ఇతర దేశాలు అభ్యంతరాలు వక్తం చేయడం కచ్చితంగా శ్రీలంక సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతలలో  జోక్యం చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. 


ఝెంహోంగ్ వ్యాఖ్యలపై శ్రీలంకలోని భారత హై కమిషన్ శనివారం తీవ్రంగా స్పందించింది. కీ ఝెంహోంగ్ తన దేశం ప్రవర్తిస్తున్నట్లుగానే మాట్లాడి ఉండవచ్చునని పేర్కొంది. భారత దేశం విభిన్నమైనదని, ప్రత్యేకమైనదని హామీ ఇస్తున్నట్లు తెలిపింది. శ్రీలంకకు ఉత్తర దిశలో ఉన్న పొరుగు దేశం గురించి ఆయన అభిప్రాయాలు తన స్వదేశ ప్రవర్తనకు అనుగుణంగా ఉండవచ్చునని తెలిపింది. సైంటిఫిక్ రీసెర్చ్ నౌక యువాన్ వాంగ్ 5ను హంబంటోటా నౌకాశ్రయానికి తీసుకురావడానికి భౌగోళిక రాజకీయ సందర్భాన్ని ఆపాదించడం ఓ సాకు మాత్రమేనని మండిపడింది. 


భారత దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగస్టు 12న మీడియాతో మాట్లాడుతూ, చైనా వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండించారు. శ్రీలంకపై తాము ఒత్తిడి తెచ్చామని చైనా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భద్రతాపరమైన అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 


Updated Date - 2022-08-28T16:35:39+05:30 IST