సరిహద్దుల్లో చైనా నిర్మాణాలపై పెంటగాన్ నివేదిక... భారత్ స్పందన...

ABN , First Publish Date - 2021-11-12T02:14:04+05:30 IST

భారత్-చైనా సరిహద్దుల్లో వివాదంలో ఉన్న భూభాగంలో

సరిహద్దుల్లో చైనా నిర్మాణాలపై పెంటగాన్ నివేదిక... భారత్ స్పందన...

న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లో వివాదంలో ఉన్న భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని చైనా నిర్మించినట్లు చెప్తున్న పెంటగాన్ నివేదికను గమనించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ అటానమస్ రీజియన్ మధ్య ఈ గ్రామం ఉందని పెంటగాన్ అమెరికన్ కాంగ్రెస్‌కు ఓ నివేదికలో తెలిపింది.


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం విడుదల చేసిన ప్రకటనలో, అమెరికన్ కాంగ్రెస్‌కు ఆ దేశ రక్షణ శాఖ పెంటగాన్ సమర్పించిన నివేదికను గమనించినట్లు తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఈస్టర్న్ సెక్టర్‌లో చైనా చేపట్టిన ఓ భారీ గ్రామ నిర్మాణ కార్యకలాపాల గురించి ఈ నివేదిక పేర్కొందని తెలిపారు. తమ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని భారత దేశం అంగీకరించబోదన్నారు. చైనా చేస్తున్న అన్యాయమైన వాదనలను భారత్ ఆమోదించలేదన్నారు. ఇటువంటి కార్యకలాపాలపై భారత దేశం దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలుపుతోందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరసనను తెలుపుతామని పేర్కొన్నారు. చైనా అనేక దశాబ్దాల క్రితం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగంతోపాటు సరిహద్దుల వెంబడి గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ కార్యకలాపాలు జరుపుతోందన్నారు. భారత దేశ భూభాగాన్ని ఈ విధంగా అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని భారత ప్రభుత్వం ఎన్నడూ అంగీకరించలేదన్నారు. ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


భారత ప్రభుత్వం భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని పెంచినట్లు తెలిపారు. రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు.  


వాస్తవాధీన రేఖ వెంబడి భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ అటానమస్ రీజియన్ మధ్య చైనా ఓ భారీ గ్రామాన్ని నిర్మిస్తోందని పెంటగాన్ నివేదిక పేర్కొంది. దాదాపు 100 ఇళ్ళను ఇక్కడ నిర్మించిందని తెలిపింది. 


Updated Date - 2021-11-12T02:14:04+05:30 IST