చరిత్ర సృష్టించిన భారత్ : మోదీ

ABN , First Publish Date - 2021-10-21T18:07:52+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని

చరిత్ర సృష్టించిన భారత్ : మోదీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని భారత్ అధిగమించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తిని ప్రశంసించారు. ఈ విజయానికి కారకులైన వైద్య సిబ్బంది, నర్సులు, ప్రజలకు మోదీ ఓ ట్వీట్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. 


2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి  తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది. 


ఈ నేపథ్యంలో మోదీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి స్ఫూర్తి, భారతీయ శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమ సాధించిన విజయాన్ని మనం చూస్తున్నామన్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీని అధిగమించినందుకు భారత దేశానికి అభినందనలు అని పేర్కొన్నారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన వైద్యులు, నర్సులు, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


అమిత్ షా ఇచ్చిన ట్వీట్లలో, ఇది చరిత్రాత్మక, గర్వకారణమైన సమయమని తెలిపారు. 100 కోట్లు కన్నా ఎక్కువ వ్యాక్సిన్ల పంపిణీ లక్ష్యాన్ని భారత దేశం నేడు (గురువారం ఉదయం 10 గంటలకు) సాధించిందన్నారు. నవ భారత శక్తి, సామర్థ్యాలను యావత్తు ప్రపంచానికి మరోసారి తెలియజేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం దోహదపడ్డాయని తెలిపారు. అనేక సవాళ్ళను అధిగమించి ఈ మహా యజ్ఞం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, హెల్త్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుని భద్రత, ఆరోగ్యం కోసం దృఢనిశ్చయంతో కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. 


Updated Date - 2021-10-21T18:07:52+05:30 IST