కోవిడ్ రెండో దశ ముగిసిపోలేదు: కేంద్రం

ABN , First Publish Date - 2021-08-26T23:52:57+05:30 IST

ఇండియా ఇప్పటికీ కోవిడ్ సెకెండ్ వేవ్ మధ్యలోనే ఉందని, కోవిడ్ ముప్పు ముగిసిపోలేదని..

కోవిడ్ రెండో దశ ముగిసిపోలేదు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటికీ కోవిడ్ సెకెండ్ వేవ్ మధ్యలోనే ఉందని, కోవిడ్ ముప్పు ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పలు పండుగలు ఉన్నందున ఆ రెండు నెలలు చాలా కీలకమవుతాయని చెప్పారు. కోవిడ్ నియమ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని గురువారంనాడు మీడియా సమావేశంలో సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్లు వ్యాధిని తగ్గిస్తాయే కానీ వ్యాధిని నిరోధించవని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు.


కేరళలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

కాగా, కేరళలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో 58.4 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు రాజేష్ భూషణ్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 10,000 నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులున్నట్టు చెప్పారు. మొత్తం నమోదైన యాక్టివ్ కేసుల్లో 51 శాతం ఒక్క కేరళలోనే ఉండగా, మహారాష్ట్రలో 16 శాతం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తక్కిన శాతం ఉన్నట్టు తెలిపారు. దేశంలోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉందని చెప్పారు.  మరోవైపు, కోవిడ్ తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం... కేరళ, మహారాష్ట్ర చీఫ్ సెక్రరటరీలతో వర్చువల్ మీటింగ్‌లో పరిస్థితి సమీక్షించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-08-26T23:52:57+05:30 IST