వ్యాక్సినేషన్ డ్రైవ్‌లోకి జైకోవ్-డి.. కోటి టీకాల కొనుగోలుకు ప్రభుత్వం రెడీ!

ABN , First Publish Date - 2021-11-09T01:10:15+05:30 IST

ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత, మూడు డోసుల కొవిడ్ టీకా జైడస్ కాడిలాను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో చేర్చాలని

వ్యాక్సినేషన్ డ్రైవ్‌లోకి జైకోవ్-డి.. కోటి టీకాల కొనుగోలుకు ప్రభుత్వం రెడీ!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత, మూడు డోసుల కొవిడ్ టీకా జైడస్ కాడిలా ‘జైకోవ్-డి’ని వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో చేర్చాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కోటి టీకాలను కొనుగోలు చేయాలని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం వ్యాక్సిన్ ధరను రూ. 265కు తగ్గించి విక్రయించేందుకు జైడస్ కాడిలా అంగీకరించినట్టు సమాచారం. 


అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా ‘జైకోవ్-డి’ని దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది సూది రహిత వ్యాక్సిన్. 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి టీకాలు వేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) ఆమోదించిన తొలి టీకా ఇదే. ఈ టీకా వేసేందుకు రూ.93 ఖరీదు చేసే పెయిన్‌లెస్ జెట్ అప్లికేటర్ అవసరం. దీంతో కలుపుకుని ఒక్కో డోస్‌ ధర రూ. 358 అవుతుంది. 


జైడస్ కాడిలా గతంలో మూడు డోసులను రూ. 1,900కు ఇస్తామని ప్రతిపాదించింది. తాజాగా, దీని ధరను తగ్గించి విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఈ టీకా  మూడు డోసులను 28 రోజుల వ్యవధిలో వేయాల్సి ఉంటుంది. ఆగస్టు 20న డీసీజీఏ నుంచి అత్యవసర వినియోగానికి జైకోవ్-డికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా జైడస్ కాడిలా ఎండీ డాక్టర్ షర్విల్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 


వ్యాక్సిన్‌ను రూ. 265కు విక్రయించేందుకు జైడస్ కాడిలా ఆసక్తి చూపిస్తున్నప్పటికీ జైకోవ్-డిని వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రవేశపెట్టేందుకు ఇమ్యునైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగి) ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కొవిడ్-19 ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో జైకోవ్-డిని ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రొటోకాల్, ఫ్రేమ్‌వర్క్‌ను ఎన్‌టాగి అందిస్తుంది. 

Updated Date - 2021-11-09T01:10:15+05:30 IST