
న్యూఢిల్లీ: కరోనా నుంచి దేశాలన్నీ దాదాపు బయటపడుతున్న వేళ అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను నడపనున్నట్టు ప్రకటించింది.
కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల క్రితం ఆగిపోయిన అంతర్జాతీయ విమాన సేవలు మళ్లీ మొదలుకానున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని చివరిసారి గత నెల 28న పొడిగించారు.
కొవిడ్ నేపథ్యంలో 23 మార్చి 2020న అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ‘వందేభారత్’ మిషన్లో భాగంగా ప్రత్యేక విమానాలకు మే 2020 నుంచి అనుమతిచ్చారు. ఇందులో భాగంగా యూఎస్, యూకే, యూఏఈ, కెన్యా, భుటాన్, ఫ్రాన్స్ తదితర 32 దేశాల నుంచి భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీసీఏ తెలిపింది. ఈ నెల 27 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపింది.
నిజానికి గతేడాది డిసెంబరు 15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని డీజీసీఏ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అయితే, ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ వెలుగు చూసి దేశాలను చుట్టేయడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిషేధాన్ని మరోమారు పొడిగించింది.
ఇవి కూడా చదవండి