విదేశాల్లో తొలి ఐఐటీ.. దుబాయ్‌లో ఏర్పాటుకు నిర్ణయం

ABN , First Publish Date - 2022-02-24T13:11:07+05:30 IST

దేశం వెలుపల మొట్టమొదటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ని నెలకొల్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

విదేశాల్లో తొలి ఐఐటీ.. దుబాయ్‌లో ఏర్పాటుకు నిర్ణయం

దుబాయిలో ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు నిర్ణయం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): దేశం వెలుపల మొట్టమొదటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ని నెలకొల్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయిలో ఐఐటీ ఏర్పాటు కానుంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐఐటీలో అరబ్‌ పౌరులతో పాటు భారతీయ విద్యార్థులు ప్రవేశం పొందొచ్చు. దీని వల్లయూఏఈలోని తెలుగు విద్యార్థులకూ ప్రయోజనాలు చేకూరనున్నాయి. యూఏఈ, ఇండియా మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా దుబాయిలో ఐఐటీ క్యాంపస్‌ నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ఇటీవల ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్‌మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ ఏఐ నహ్వాన్‌ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో దుబాయ్‌లో ఐఐటీ స్థాపనకు ముందడుగు పడింది. 


ఏటా వేలాదిమంది మాతృదేశానికి.. ఇంజనీరింగ్‌ ఉన్నత విద్యకు సంబంధించి యూఏఈలో ఉన్న పరిమిత అవకాశాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భారతీయ విద్యార్థులు మాతృదేశానికి తిరిగి వెళ్తుంటారు. గల్ఫ్‌ దేశాలలోని ప్రవాసీ విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలను సులభతరం చేస్తూ రెండేళ్ల క్రితం మోదీ దశ పేరిట ఓ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. యూఏఈలో ఐఐటీ నెలకొల్పితే గల్ఫ్‌లోని ప్రవాసీ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అబుదాబిలో ఉంటోన్న ఐఐటీ  మాజీ విద్యార్థి రాజ శ్రీనివాస రావు అన్నారు. దుబాయిలో ఏర్పాటయ్యే ఐఐటీ భారతదేశంలోని ఐఐటీల స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుందా? అనే దానిపై ఇప్పుడే అంచనాకు రాలేమని రాజశ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. దుబాయిలో ఐఐటీ ఏర్పాటైతే ఇక్కడి భారత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని దుబాయిలోని ఒక ప్రైవేటు వర్సిటీ ప్రొఫెసర్‌ అఖిల  పేర్కొన్నారు.  

Updated Date - 2022-02-24T13:11:07+05:30 IST