అజేయంగా ముగించాలని..

ABN , First Publish Date - 2022-06-28T09:40:14+05:30 IST

ఐర్లాండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా పూర్తి స్థాయిలో జరగలేకపోయింది.

అజేయంగా ముగించాలని..

జోష్‌లో భారత్‌

నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20

రాత్రి 9 గం. నుంచి సోనీ సిక్స్‌లో..

మలహిడే (డబ్లిన్‌): ఐర్లాండ్‌తో తొలి టీ20 వర్షం కారణంగా పూర్తి స్థాయిలో జరగలేకపోయింది. దీంతో భారత యువ ఆటగాళ్లు సరైన రీతిలో అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ క్రికెటర్లకు ఇదే చివరి అవకాశం.


ఈనేపథ్యంలో మంగళవారం ఆఖరిదైన రెండో టీ20 జరుగనుంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న పాండ్యా సేన ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీ్‌సను దక్కించుకోవాలనుకుంటోంది. ప్రత్యర్థితో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా అజేయంగా ఉంది. ఇక భారత్‌లాంటి జట్లతో అరుదుగా పోటీపడే అవకాశం దక్కుతుంది కాబట్టి ఐర్లాండ్‌ ఈ మ్యాచ్‌లోనైనా గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. తొలి పోరులో హ్యారీ టెక్టర్‌ సూపర్‌ షో అందరినీ ఆకట్టుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశముంది.


రుతురాజ్‌ సందేహమే..:

తొలి టీ20 మ్యాచ్‌ తుది జట్టులో ఉన్నా ఓపెనర్‌గా రుతురాజ్‌ బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో ఇషాన్‌కు జతగా దీపక్‌ హుడా ఆడి చివరికంటా నిలిచాడు. కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న రుతురాజ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్‌ లేదా రాహుల్‌ త్రిపాఠిలలో ఒకరిని ఆడించవచ్చు. ఇషాన్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌ అంతా ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అంశం.


కానీ సూర్యకుమార్‌ కమ్‌బ్యాక్‌ మ్యాచ్‌లో ఒక్క బంతికే పరిమితమయ్యాడు. ఇక ఉమ్రాన్‌ తన తొలి ఓవర్‌లోనే 14 రన్స్‌ సమర్పించుకున్నా.. అతడి ప్రతిభను ఒక్క మ్యాచ్‌తోనే అంచనా వేయలేం. అందుకే ఈ మ్యాచ్‌లోనూ అతను ఆడవచ్చు. పేసర్‌ భువనేశ్వర్‌ స్వింగ్‌ బంతులను ఎదుర్కోవడంలో ఐర్లాండ్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. డెత్‌ ఓవర్లలో అవేశ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చాహల్‌ (3-0-11-1) మాత్రం అద్భుతంగా రాణించి ప్రత్యర్థి జట్టు స్కోరును కట్టడి చేశాడు. వీరంతా 22 ఏళ్ల హ్యారీ టెక్టర్‌ స్ట్రోక్‌ప్లేను ఆదిలోనే అడ్డుకోవాల్సి ఉంది.


విజయమే లక్ష్యంగా..:

తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ అంచనాలకు మించే సాగింది. ఆరంభంలో వికెట్ల పతనం తీరు చూస్తే 100 దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ టెక్టర్‌ ధాటికి స్కోరుబోర్డు పరిగెత్తింది. అతడి అద్భుత షాట్లకు భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అందరి దృష్టి అతడిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ బౌలర్లు మాత్రం సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేక మూల్యం చెల్లించుకున్నారు. పేసర్‌ క్రెయిగ్‌ యంగ్‌ స్వింగ్‌తో పాటు సీమ్‌ రాబట్టి ఇబ్బందిపెట్టగలిగాడు. నేటి మ్యాచ్‌లో చాహల్‌ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు.. టాపార్డర్‌ రాణిస్తే భారీ స్కోరు ఖాయమే.


తుది జట్లు (అంచనా)

భారత్‌:

ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌/శాంసన్‌/త్రిపాఠి, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌, అవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌/అర్ష్‌దీ్‌ప, చాహల్‌.


ఐర్లాండ్‌:

స్టిర్లింగ్‌, బల్బర్నీ (కెప్టెన్‌), డెలానీ, టెక్టర్‌, టక్కర్‌, డాక్‌రెల్‌, అడెయిర్‌, మెక్‌బ్రైన్‌, యంగ్‌, లిటిల్‌, ఓల్ఫెర్ట్‌.

Updated Date - 2022-06-28T09:40:14+05:30 IST