భారత్‌ ‘టీకా’ అద్భుతం!

ABN , First Publish Date - 2022-04-23T07:49:02+05:30 IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం చర్చలు జరిపారు.

భారత్‌ ‘టీకా’ అద్భుతం!

ఎంతో బాగా పనిచేసింది

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇరు దేశాధినేతలు.. ద్వైపాక్షిక అంశాలు సహా అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో రూపొందించిన వ్యాక్సిన్‌ అద్భుతమని, తాను స్వయంగా తీసుకుని కొవిడ్‌ నుంచి రక్షణ పొందానని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీని.. ‘నరేంద్ర’ అనడం ఎంతో ఇష్టమని పేర్కొన్న బోరిస్‌.. ‘‘నరేంద్ర నాకు ప్రత్యేక స్నేహితుడు. ఆయన నేతృత్వంలో భారత్‌ ప్రపంచ ఫార్మసీగా అవతరిస్తోంది’’ అని ప్రశంసల జల్లు కురిపించారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా, సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ‘‘భారత్‌ టీకా నా జబ్బలోనే ఉంది. ఇది నాకు చాలా మేలు చేసింది. భారత్‌కు వేనవేల కృతజ్ఞతలు’’ అని తెలిపారు.


భారత్‌ కోసం కొత్త లైసెన్స్‌!

అధికార వ్యవస్థపై ఆధారపడడాన్ని, రక్షణ ఉత్పత్తుల సేకరణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్‌ కోసం బ్రిటన్‌ ఓపెన్‌ జనరల్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌(ఓజీఈఎల్‌) విధానాన్ని తీసుకురానుందని బ్రిటన్‌ ప్రధాని వెల్లడించారు. అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ సాంకేతికతలో భారత్‌కు బ్రిటన్‌ భాగస్వామిగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ‘మేకిన్‌ ఇండియా’కు సంపూర్ణ మద్దతిస్తామని తెలిపారు. తమ దేశ భూభాగం నుంచి ఇతర దేశాలపై సాగించే ఉగ్రదాడులను  సహించేది లేదన్న ఆయన, ఖలిస్థాన్‌ వ్యవహారంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రష్యా విషయంలో భారత్‌ ఒక నిబద్ధతను పాటిస్తోందని కొనియాడారు. బుచాలో జరిగిన ఘోర కలిపై భారత్‌ తనదైన శైలిలో స్పందించిందన్నారు.  


దీపావళి నాటికి కీలక ఒప్పందం: మోదీ

అన్ని దేశాలు బాగుండాలనేదే తమ విధానమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని, కాల్పుల విరమణ పాటించాలని అన్నారు. సమస్యలను చర్చల ద్వారా, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్‌ ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే వహిస్తుందని నొక్కిచెప్పారు. కాగా, ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందానికి ఈ ఏడాది దీపావళి నాటికి ఆమోద ముద్ర వేసేలా ఇరు ప్రధానులు అంగీకరించారు. భారత్‌, బ్రిటన్‌ల మధ్య రాబోయే పదేళ్లకు సంబంధించిన మార్గసూచిని ఇరు ప్రధానులు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.  


బ్రిటన్‌ లేబర్‌పార్టీ ఎంపీపై నఖ్వీ ఫైర్‌

భారత్‌ పర్యటనలో ఉన్న బ్రిటన్‌  ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. తన చర్చల్లో ‘ఇస్లామోఫోబియా’ అంశాన్ని కూడా ప్రస్తావించాలంటూ పాకిస్థాన్‌ సంతతికి చెందిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీ మహిళా ఎంపీ నాజ్‌ షా ట్విటర్‌లో సూచించారు. ఆమె ట్వీట్లపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మండిపడ్డారు. ఇండియా ఫోబియా అనే ఆమె పక్షపాత వైఖరిని ఇస్లామోఫోబియాగా మార్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక... దేశంలో బుల్‌డోజర్ల కూల్చివేత వివాదాలు జరుగుతున్న సమయంలో.. బోరిస్‌ గుజరాత్‌లోని వడోదరా సమీపంలో జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తప్పుబట్టింది. బోరి్‌స ఓ అజ్ఞాని అంటూ విమర్శించింది.


వారిని అప్పగించాలనే ఉంది.. కానీ!

బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్థులు విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీలను భారత్‌కు అప్పగించాలని ఆదేశించినట్టు బోరిస్‌ తెలిపారు. అయితే, కొన్ని సాంకేతిక పరమైన అంశాల కారణంగాఇది సంక్లిష్టంగా మారిందన్నారు. భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకు, బ్రిటన్‌ న్యాయవ్యవస్థను వినియోగించుకోవడాన్ని స్వాగతించబోమని తెలిపారు.


నేనే అమితాబ్‌, నేనే సచిన్‌!!

భారత్‌ ఇచ్చిన ఆతిథ్యానికి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముగ్ధులయ్యారు. ‘‘భారత్‌ ఆతిథ్యం నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. నన్ను నేను అమితాబ్‌బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌లా భావిస్తున్నాను. నా ఖాసా దోస్త్‌.. నరేంద్ర సొంత రాష్ట్రంలో అమోఘమైన స్వాగతం లభించింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మోదీని తరచుగా తాకుతూ.. బోరిస్‌ ఉల్లాసంగా మాట్లాడారు.


Updated Date - 2022-04-23T07:49:02+05:30 IST