IND vs SA: గ్రౌండ్‌లోకి పాము.. టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌లో.. వీడియో..

ABN , First Publish Date - 2022-10-03T01:34:40+05:30 IST

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు ఒక అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి వచ్చింది. ఆ అతిథిని చూసి ఆటగాళ్లంతా..

IND vs SA: గ్రౌండ్‌లోకి పాము.. టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌లో.. వీడియో..

గౌహతి: టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు ఒక అనుకోని అతిథి గ్రౌండ్‌లోకి వచ్చింది. ఆ అతిథిని చూసి ఆటగాళ్లంతా హడలిపోయారు. అతిథిని చూస్తే బెదిరిపోవడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఆ అతిథి మరెవరో కాదు ఒక పాము. ఔను.. మీరు చదువుతోంది నిజమే. ఏడో ఓవర్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక పాము గ్రౌండ్‌లో హల్‌చల్ చేసింది. ఆ పామును ఫీల్డింగ్ చేస్తున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు గమనించారు. ఆ పామును చూసి నిర్వాహకులు సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చి ఆ పామును తీసుకెళ్లిపోయారు. ఈ పరిణామం కారణంగా కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ఆటగాళ్లు ఊహించని ఈ బ్రేక్‌లో డ్రింక్స్ తాగి రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత మ్యాచ్ యధావిధిగా జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యాన్ని అందించారు. 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పదో ఓవర్‌లో ఐదో బంతికి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రోహిత్ శర్మ స్టబ్స్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు.



టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టీ20లో డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ ఈ మ్యాచ్‌లో మాత్రం 43 పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టీ20లో కూడా నిలకడగా రాణించాడు. రెండో టీ20లో కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 24 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 55 పరుగులు చేసి సత్తా చాటాడు. టీమిండియా ఈ వార్త రాసే సమయానికి 11 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 56(26), విరాట్ కోహ్లీ 1(3) స్కోర్‌తో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-10-03T01:34:40+05:30 IST