భారత్‌ క్లీన్‌స్వీప్

ABN , First Publish Date - 2022-03-15T06:08:56+05:30 IST

ఊహించిందే... భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఎప్పటిలాగే శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. చేతిలో తొమ్మిది వికెట్లున్నా కనీసం రోజంతా కూడా క్రీజులో నిలువలేకపోయారు....

భారత్‌ క్లీన్‌స్వీప్

రోహిత్‌ కెప్టెన్సీలో ఐదోది

గులాబీ టెస్టులో ఘనవిజయం

238 రన్స్‌ తేడాతో శ్రీలంక చిత్తు 

కరుణరత్నె శతక పోరాటం


ఊహించిందే... భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఎప్పటిలాగే శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. చేతిలో తొమ్మిది వికెట్లున్నా కనీసం రోజంతా కూడా క్రీజులో నిలువలేకపోయారు. తద్వారా గులాబీ టెస్టులోనూ టీమిండియాదే గుభాళింపు. స్పిన్నర్‌ అశ్విన్‌ అద్భుత బంతులకు తోడు బుమ్రా పదునైన పేస్‌తో విరుచుకుపడగా, రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. అయితే సహచరులు విఫలమైన చోట కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు స్వదేశంలో 2021-22 సీజన్‌ను భారత్‌ ఓటమి లేకుండా ముగించింది.


బెంగళూరు: ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌ జట్టుకు క్లీన్‌స్వీ్‌పలు అత్యంత సహజంగా మారాయి. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీ్‌సను సైతం 2-0తో దక్కించుకుంది. ఇప్పటికే ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌ను ఓటమి లేకుండా ముగించిన విషయం తెలిసిందే. 447 పరుగుల రికార్డు ఛేదన కోసం బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. తద్వారా మూడో రోజునే భారత్‌కు 238 పరుగుల భారీ విజయం దక్కింది. అంతేకాకుండా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప టేబుల్‌లో జట్టు నాలుగో స్థానానికి చేరింది. కెప్టెన్‌ కరుణరత్నె (107) వీరోచిత సెంచరీతో పాటు కుశాల్‌ మెండిస్‌ (54) అర్ధసెంచరీ కారణంగా ఆ జట్టు సిరీ్‌సలో తొలిసారి 200 పరుగులైనా దాటగలిగింది. అశ్విన్‌కు నాలుగు, బుమ్రాకు మూడు, అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా పంత్‌ నిలిచారు. ఈ మ్యాచ్‌తో లంక పేసర్‌ సురంగ లక్మల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.


తొలి సెషన్‌లో పోరాటం: 447 పరుగుల కష్టసాధ్యమైన ఛేదన కోసం లంక 28/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే సిరీ్‌సలో తొలిసారిగా లంకేయుల నుంచి పోరాటం కనిపించింది. తొలి సెషన్‌లో 3 వికెట్లు కోల్పోయినా 123 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కెప్టెన్‌ కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అశ్విన్‌, జడేజా ఓవర్లను ఈ ఇద్దరు ఆత్మవిశ్వాసంతో ఆడగలిగారు. ముఖ్యంగా మెండిస్‌ ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చక్కటి ఫుట్‌వర్క్‌ను కనబరుస్తూ అతడు 57 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఓ ఫోర్‌ బాది అశ్విన్‌ ఓవర్‌లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 97 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. ఇక స్వల్ప వ్యవధిలోనే మాథ్యూస్‌ (1), ధనంజయ (4) వికెట్లను కోల్పోయిన లంక 151/4తో బ్రేక్‌కు వెళ్లింది.


కరుణరత్నె ఎదురుదాడి: టీ బ్రేక్‌ తర్వాత మాత్రం భారత్‌ పూర్తి ఆధిపత్యం చూపింది. దీంతో లంక ఈ సెషన్‌ను పూర్తిగా ఆడలేకపోయింది. కానీ మరో ఎండ్‌లో కరుణరత్నె అసాఽధారణ పోరాటం చూపాడు. స్పిన్నర్ల బంతులకు బ్యాట్లు అడ్డం పెట్టేందుకు కూడా సహచరులు ఇబ్బందిపడిన వేళ అతడు మాత్రం శతకంతో సమాధానమివ్వడం విశేషం. ఆరంభంలోనే డిక్‌వెల్లా (12)ను అక్షర్‌ అవుట్‌ చేయగా మరోవైపు కరుణరత్నె అడపాదడపా ఫోర్లతో జోరు పెంచాడు. 89 రన్స్‌ వద్ద అతడి క్యాచ్‌ను రోహిత్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బుమ్రా ఓవర్‌లో ఫోర్‌తో సెంచరీని పూర్తిచేశాడు. అదే ఓవర్‌లో మరో ఫోర్‌తో జట్టు స్కోరును 200కి చేర్చాడు. కానీ అతడి దూకుడుకు బుమ్రా తన మరుసటి ఓవర్‌లోనే చెక్‌ పెట్టాడు. బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి బంతి వికెట్లను గిరాటేసింది. ఇక ఇక్కడి నుంచి లంక పతనం వేగంగా సాగింది. వరుసగా మూడు ఓవర్లలో చివరి మూడు వికెట్లు కోల్పోవడంతో ఘోర ఓటమి తప్పలేదు.


స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 252

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 109

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 303/9 డిక్లేర్డ్‌

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: తిరిమన్నె (ఎల్బీ) బుమ్రా 0; కరుణరత్నె (బి) బుమ్రా 107; కుశాల్‌ మెండిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 54; మాథ్యూస్‌ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్‌ 4; డిక్‌వెల్లా (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 12; అసలంక (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) అశ్విన్‌ 2; లక్మల్‌ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమి (బి) అశ్విన్‌ 2; జయవిక్రమ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 59.3 ఓవర్లలో 208 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-97, 3-98, 4-105, 5-160, 6-180, 7-204, 8-206, 9-208, 10-208. బౌలింగ్‌: బుమ్రా 9-4-23-3; షమి 6-0-26-0; అశ్విన్‌ 19.3-3-55-4; జడేజా 14-2-48-1; అక్షర్‌ 11-1-37-2.


8

స్పిన్నర్‌ అశ్విన్‌ అత్యధిక టెస్టు వికెట్ల (442) జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరాడు. ఈక్రమంలో తను డేల్‌ స్టెయిన్‌ (439)ను అధిగమించాడు.


2021/22 సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన 4 టెస్టులు (3 విజయాలు, ఒక డ్రా), మూడు వన్డేలు, 9 టీ20లను భారత జట్టు అజేయంగా ముగించడం విశేషం.


కోహ్లీ ఫ్యాన్స్‌ అరెస్టు

గులాబీ టెస్టు రెండోరోజు ఆటలో మైదానంలోకి చొరబడిన విరాట్‌ కోహ్లీ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. రెండో రోజు ఆదివారం ఆట చివర్లో భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన నలుగురు ఫ్యాన్స్‌ కోహ్లీతో సెల్ఫీ కూడా దిగారు. దీంతో వారిని సిబ్బంది పోలీసులకు అప్పగించగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఆ నలుగురిని కోర్టులో హాజరుపరిచారు.


రో‘హిట్‌’

రోహిత్‌ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌ అయ్యాక ‘తగ్గేదేలే’ అనే రీతిలో భారత జట్టు  దూసుకెళుతోంది. ఓటమనేదే లేకుండా అతడి ఆధ్వర్యంలో వరుసగా ఐదు సిరీ్‌సలను క్లీన్‌స్వీ్‌ప చేయడం విశేషం. తొలిసారిగా అతను న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సకు అధికారిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో జట్టు 3-0తో గెలిచింది. ఆ తర్వాత విండీ్‌సపై మూడు వన్డేల సిరీ్‌సను, మూడు టీ20ల సిరీ్‌సలను క్లీన్‌స్వీప్‌ చేయగా.. తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీ్‌సతో పాటు రెండు టెస్టుల సిరీ్‌సను సైతం వైట్‌వాష్‌ చేసింది. దీంతో నాయకుడిగా సూపర్‌హిట్‌ అనిపించుకున్నాడు. ఇక ఐపీఎల్‌ ముగిశాక జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌ అతడికి సవాల్‌ కానుంది.


1

స్వదేశంలో భారత్‌కిది వరుసగా 15వ సిరీస్‌ విజయం. 2012, డిసెంబరులో చివరిసారిగా జట్టు సిరీస్‌ ఓడింది. మరే ఇతర జట్టు కూడా స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ విజయాలకు మించి నెగ్గలేదు.


2

శ్రీలంక ఓపెనర్లలో ఎక్కువ టెస్టు సెంచరీలు (14) సాధించిన రెండో బ్యాటర్‌గా కరుణరత్నె. ఆటపట్టు (16) ముందున్నాడు.  

Updated Date - 2022-03-15T06:08:56+05:30 IST