అదరగొట్టిన హర్మన్‌

ABN , First Publish Date - 2022-06-26T10:09:44+05:30 IST

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31 నాటౌట్‌, 1/12) ఆల్‌రౌండ్‌ షోతో.. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

అదరగొట్టిన హర్మన్‌

రెండో టీ20లో భారత్‌ గెలుపు

లంకతో సిరీస్‌ వశం


దంబుల్లా: కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31 నాటౌట్‌, 1/12) ఆల్‌రౌండ్‌ షోతో.. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకొంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 125/7 స్కోరు చేసింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45), కెప్టెన్‌ చమరి ఆటపట్టు (43) తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. కానీ, వీరిద్దరూ పెవిలియన్‌ చేరిన తర్వాత.. పరిస్థితి తారుమారైంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీప్తి 2 వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో భారత్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (34 బంతుల్లో 39) ధాటిగా ఆడడంతో భారత్‌ ఎక్కడా ఇబ్బందిపడలేదు. ఆమెకు మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (17), సబ్బినేని మేఘన (17) చక్కని సహకారం అందించారు. అనంతరం హర్మన్‌ ధాటిగా ఆడుతూ మరో 5 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఒషాడ, ఐనోక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మూడు, ఆఖరి టీ20 సోమవారం జరగనుంది.


సంక్షిప్త స్కోర్లు: 

శ్రీలంక: 20 ఓవర్లలో 125/7 (విష్మి 45, చమరి 43; దీప్తి 2/34); భారత్‌: 19.1 ఓవర్లలో 127/5 (స్మృతి 39, హర్మన్‌ 31 నాటౌట్‌; ఐనోక 2/18, ఒషాడ 2/32). 


టీ20ల్లో వేగంగా 2000 పరుగుల మైలురాయిని చేరిన రెండో భారత బ్యాటర్‌గా స్మృతి మంధాన (84 ఇన్నింగ్స్‌లో). ఈ జాబితాలో మిథాలీ రాజ్‌ (70 ఇన్నింగ్స్‌) అగ్ర స్థానంలో ఉండగా.. హర్మన్‌ప్రీత్‌ (88 ఇన్నింగ్స్‌) మూడో స్థానంలో కొనసాగుతోంది.

Updated Date - 2022-06-26T10:09:44+05:30 IST