ICC Women's World Cup: అర్ధశతకాలతో రాణించిన మిథాలీ, భాటియా, హర్మన్.. ఆసీస్‌కు భారీ టార్గెట్

ABN , First Publish Date - 2022-03-19T15:30:16+05:30 IST

ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.

ICC Women's World Cup: అర్ధశతకాలతో రాణించిన మిథాలీ, భాటియా, హర్మన్.. ఆసీస్‌కు భారీ టార్గెట్

ఆక్లాండ్‌: ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆసీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీసేనకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు షెఫాలీ శర్మ(12), స్మృతి మంధాన(10) వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత జట్టు 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, యస్తీక భాటియాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. అనవసరమైన షాట్లకు పోకుండా ఆచితూచి ఆడిందీ ద్వయం. 


ఈ క్రమంలో మిథాలీ అర్ధశతకం(77 బంతుల్లో 50: 3ఫోర్లు, ఒక సిక్సర్) నమోదు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే యస్తీక భాటియా కూడా హాఫ్ సెంచరీ(77 బంతుల్లో 53: 5ఫోర్లు ) బాదింది. అర్ధశతకం అనంతరం బ్యాట్ ఝులిపించే క్రమంలో భాటియా 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరింది. దీంతో ఈ జోడీ 130 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మిథాలీ కూడా ఔటైంది. 68 పరుగులు చేసిన మిథాలీ కింగ్ బౌలింగ్‌లో పెర్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. కెప్టెన్ అవుటైనా తర్వాత ఇన్నింగ్స్‌ను సీనియర్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ తన భుజాన వేసుకుంది. ఆచితూచి ఆడుతూ అర్ధశతకం నమోదు చేసింది. 42 బంతుల్లో 6 బౌండరీ సహాయంతో 50 పరుగులు చేసింది. 


చివర్లో పూజ వస్త్రాకర్ కూడా బ్యాట్ ఝులిపించింది. 28 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, ఒక బౌండరీతో 34 పరుగులు చేసింది. ఏడో వికెట్‌కు పూజ, హర్మన్ కలిసి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. కంగారులకు 278 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ బౌలర్లలో  డ్రాసీ బ్రౌన్ 3 వికెట్లు తీస్తే.. అలాన్ కింగ్ రెండు, జెస్ ఒక వికెట్ పడగొట్టింది. ఇక మిథాలీసేనకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. భారత్‌ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

Updated Date - 2022-03-19T15:30:16+05:30 IST