కరుణరత్నె ఒంటరి పోరు వృథా.. చిత్తుగా ఓడిన శ్రీలంక

ABN , First Publish Date - 2022-03-14T23:33:07+05:30 IST

శ్రీలంకతో జరుతున్న డే/నైట్ టెస్టులో భారత జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. 447 పరుగుల..

కరుణరత్నె ఒంటరి పోరు వృథా.. చిత్తుగా ఓడిన శ్రీలంక

బెంగళూరు: శ్రీలంకతో జరుతున్న డే/నైట్ టెస్టులో భారత జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. 447 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె శకతం (107)తో పోరాడినప్పటికీ సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 204 పరుగుల వద్ద కరుణరత్నె ఏడో వికెట్‌గా అవుటైన తర్వాత మిగతా మూడు వికెట్లు నాలుగు పరుగుల వ్యవధిలోనే కోల్పోయి ఓటమి పాలైంది. 


అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 303 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో 446 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకను భారత బౌలర్లు కుదురుకోనీయలేదు. అశ్విన్, బుమ్రాలు చెలరేగి వికెట్లు తీయడంతో లంక ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది.  అశ్విన్ 4, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కరుణరత్నె ఒంటరిగా పోరాడాడు. అయితే, సహచరుల ఒక్కొక్కరే వెనుదిరగడంతో  ఏమీ చేయలేకపోయాడు. 


జట్టులో ఏడుగురు ఆటగాళ్లు కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. కరుణరత్నె(107) తర్వాత కుశాల్ మెండిస్ చేసిన 54 పరుగులకే జట్టులో రెండో అత్యధికం. కాగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో చేజిక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన లంక పరాభవ భారంతో వెనుదిరుగుతోంది.


Updated Date - 2022-03-14T23:33:07+05:30 IST