విండీస్ టెయిలెండర్ల పోరాటం వృథా.. తప్పని వైట్‌వాష్

ABN , First Publish Date - 2022-02-12T02:36:34+05:30 IST

అనుకున్నదే అయింది. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావించిన

విండీస్ టెయిలెండర్ల పోరాటం వృథా.. తప్పని వైట్‌వాష్

అహ్మదాబాద్: అనుకున్నదే అయింది. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావించిన వెస్టిండీస్‌కు మరోమారు నిరాశే ఎదురైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన చివరి వన్డేలో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే రోహిత్ శర్మ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.


భారత్ నిర్దేశించిన 266 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల బంతులను ఎదుర్కోలేని విండీస్ ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. టాపార్డర్, మిడిలార్డ్ దారుణంగా కుప్పకూలింది. కెప్టెన్ నికోలస్ పూరన్ 34 పరుగులతో కొంత పర్వాలేదనిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విండీస్ టెయిలెండర్ల గురించే.


122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టుకు అల్జారీ జోసెఫ్ (29), ఒడియన్ స్మిత్ (36) కాపుకాశారు. భారత బౌలర్లకు వీరిద్దరూ కొరకరాని కొయ్యగా మారి పరుగులు పిండుకున్నారు. దీంతో మ్యాచ్ మళ్లీ విండీస్ వైపు మొగ్గినట్టు కనిపించింది. అద్భుతం జరగబోతోందా? అని అనిపించింది. ఇద్దరూ కలిసి నిదానంగా ఆడుతూ పరుగులు రాబట్టారు.


అయితే, బౌలర్ల ముందు వీరి బ్యాట్ తిరగలేదు. జోసెఫ్‌ను ప్రసిద్ధ్ కృష్ణ.. స్మిత్‌, వాల్ష్‌ను సిరాజ్ వెనక్కి పంపడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (13), ధవన్ (10), కోహ్లీ (0) దారుణంగా విఫలం కాగా, శ్రేయాస్ అయ్యర్ (80), పంత్ (56) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వాషింగ్టన్ సుందర్ 33, దీపక్ చాహర్ 38 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ నాలుగు వికెట్లు తీసుకోగా, జోసెఫ్‌, వాల్ష్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. స్మిత్, అలెన్ చెరో వికెట్ తీసుకున్నారు. 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.


Updated Date - 2022-02-12T02:36:34+05:30 IST