నిలువెల్లా నిర్లక్ష్యం

Published: Fri, 23 Sep 2022 04:25:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిలువెల్లా నిర్లక్ష్యం

అభిమానుల నరక యాతన

జింఖానా ఘటనలో హెచ్‌సీఏపై కేసులు

టిక్కెట్లు అయిపోయాయి :  హెచ్‌సీఏ

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌): భాగ్యనగరం వేదికగా ఏదైనా క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్‌ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. రాక.. రాక దాదాపు మూడేళ్ల తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్‌కు లభించడంతో ఎప్పుడెప్పుడు టిక్కెట్లు విక్రయిస్తారా అని ఫ్యాన్స్‌ కళ్లలో వత్తులేసుకొని యాప్‌లో వెతికారు.. జింఖానాలో పడిగాపులు కాచారు. అయితే, టిక్కెట్ల విక్రయంలో హెచ్‌సీఏ తొలి నుంచి దాగుడుమూతలు ఆడుతూ రావడంతో సమస్య ఉత్పన్నమైంది. టిక్కెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారు? ఎలా విక్రయిస్తారనేది స్పష్టంగా తెలియజేయకపోవడంతో అభిమానుల్లో ఏర్పడిన గందరగోళం పరిస్థితిని అదుపు తప్పేలా చేసింది. 

నిలువెల్లా నిర్లక్ష్యం

 తొలుత పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తామని చెప్పి బుధవారం రాత్రి హఠాత్తుగా జింఖానాలోనూ అమ్ముతామని చెప్పేసరికి అక్కడికి వేలాది సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇప్పటికీ ఎన్ని టిక్కెట్లు విక్రయించారో తెలపని హెచ్‌సీఏ గురువారం రాత్రి టిక్కెట్లు మొత్తం అయిపోయాయని బోర్డు తిప్పేసింది. జింఖానాలో పరిస్థితి లాఠీ చార్జ్‌కి దారితీసి ఉద్రిక్తంగా మారాక కళ్లు తెరిచిన ప్రభుత్వం హడావుడిగా సమీక్షాసమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పడం విమర్శలకు తావిస్తోంది.

నిలువెల్లా నిర్లక్ష్యం

అసలు ఎందుకీ తిప్పలు..?

హైదరాబాద్‌ వేదికగా గతంలో ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగినా వారం ముందే హెచ్‌సీఏ అన్ని వివరాలూ తెలియజేసేది. స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేలు కాగా, అందులో ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెడుతున్నారు. టిక్కెట్ల శ్రేణి, ధరల పట్టిక, ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు వంటి వివరాలను తెలియజేసేవారు. అయితే, అజరుద్దీన్‌ అధ్యక్షుడయ్యాక ఈ ఆనవాయితీకి పాతరేసి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పలువురు క్లబ్‌ సెక్రటరీలు విమర్శిస్తున్నారు.


అజర్‌ వైఖరితోనే...

ప్రస్తుతం హెచ్‌సీఏ కార్యవర్గంలో ఇద్దరే ఉండడంతో అన్ని పనులు సమర్థవంతంగా చేయలేకపోయారని.. దీని వల్ల కొంత ఇబ్బంది జరిగిందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. వాస్తవానికి హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో ఉంది ఇద్దరు కాదు ఆరుగురు సభ్యులు. అయితే, అజరుద్దీన్‌ ఒంటెత్తు పోకడలతో మిగిలిన సభ్యులను దూరం పెట్టి వన్‌మ్యాన్‌ షోకు తెర తీయడంతో అసోసియేషన్‌ అభాసుపాలైంది. అధ్యక్షుడు అజరుద్దీన్‌ మిగిలిన సభ్యులెవరినీ దగ్గరికి రానివ్వకుండా అంతా నా ఇష్టం అనే పంధాలో మ్యాచ్‌ ఏర్పాట్లు చేస్తూ, తిరిగి ఇద్దరే సభ్యులున్నామని పొంతన లేని కారణాలను సాకుగా చూపిస్తున్నారు.


ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ గందరగోళం..

టిక్కెట్లు ఎప్పుటినుంచి అమ్ముతారు.. మొత్తం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తారా? కౌంటర్ల ద్వారా ప్రత్యక్షంగా అమ్ముతారా? అనే అంశంపై బుధవారం వరకు హెచ్‌సీఏ కానీ, రాష్ట్ర క్రీడా శాఖగానీ స్పష్టత ఇవ్వకపోవడం ఇంత గందరగోళానికి దారితీసింది. రవీంద్రభారతిలో బుధవారం సాయంత్రం మంత్రి మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించడం లేదని చెప్పగా, హఠాత్తుగా రాత్రి 10 గంటలకు గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానాలో టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు హెచ్‌సీఏ ఒక లేఖ విడుదల చేసింది. గంటకో నిర్ణయం, పూటకో ప్రకటన చేస్తూ అభిమానులను పూర్తిగా అయోమయానికి, గందరగోళానికి హెచ్‌సీఏ గురి చేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిలువెల్లా నిర్లక్ష్యం

మొత్తం టిక్కెట్లు అయిపోయాయి: హెచ్‌సీఏ 

మొత్తానికి టిక్కెట్లు అన్నీ అయిపోయాయని హెచ్‌సీఏ అధికారికంగా ప్రకటించింది. ‘పేటీఎం ఇన్‌సైడర్‌’ యాప్‌లో బుక్‌ చేసుకున్న వారికి మాత్రం శుక్రవారం నుంచి సికింద్రాబాద్‌ జింఖానా వద్ద టిక్కెట్లు జారీ చేయనున్నామని తెలిపింది. యాప్‌లో బుక్‌ చేసుకున్న వారు ఆ వివరాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏదొక అడ్రస్‌ ఫ్రూఫ్‌ చూపించాలని సూచించింది.


టిక్కెట్ల కోసం సిఫారసు లేఖ!

అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం నుంచి టిక్కెట్లు, కాంప్లిమెంటరీ పాసుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదన్న విమర్శలను ఇటీవల క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, హెచ్‌సీఏ వర్గాలు ఖండించాయి. టిక్కెట్లు బ్లాక్‌ చేసే వారిపై నిఘా పెడతామని, ఉక్కు పాదం మోపుతామని శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా హెచ్చరించడం కూడా తెలిసిందే. అయితే, ఈనెల 19న క్రీడా మంత్రి అదనపు ప్రైవేట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ అంబటి పేరిట ప్రభుత్వ అధికారిక లెటర్‌ ప్యాడ్‌పై భారీ సంఖ్యలో టిక్కెట్లు కావాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌కు ఒక లేఖ రాశారు.


ఆ లేఖలో ఏముందంటే హైదరాబాద్‌లో ఈనెల 25న జరగనున్న భారత్‌-ఆస్ర్టేలియా టీ20 మ్యాచ్‌కు క్రీడా మంత్రి ఆదేశాల మేరకు వీవీఐపీ టిక్కెట్లు 50, రూ.7,500ల టిక్కెట్లు 10, సాధారణ టిక్కెట్లు 100, వీఐపీ గ్యాలరీ బ్యాక్స్‌ (25 మంది సామర్థ్యం) ఒకటి డబ్బులు చెల్లించి తీసుకుంటామని, 185 టిక్కెట్లు కేటాయించాలని లేఖ రాశారు.ఈ లెక్కన రాష్ట్రంలోని ఎంత మంది రాజకీయ నాయకులు, అధికారులు లేఖలు రాసి టిక్కెట్లు దక్కించుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు, క్లబ్‌ సెక్రటరీలే వేల సంఖ్యలో టిక్కెట్లు బ్లాక్‌ చేస్తే సాధారణ అభిమానులకు టిక్కెట్లు ఎలా దొరుకుతాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిలువెల్లా నిర్లక్ష్యం

అజర్‌తో పాటు సంఘంపై 3 కేసులు నమోదు

హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌తో పాటు అసోసియేషన్‌ ప్రతినిధులపై మూడు కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. టిక్కెట్ల విక్రయ ఏర్పాట్లలో లోపంతో పాటు బ్లాక్‌లో అమ్ముకున్నారనే ఆరోపణల కింద హైదరాబాద్‌ యాక్ట్‌తో పాటు 420, 21,22/76తో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిలువెల్లా నిర్లక్ష్యం

ఆ రెండు చోట్ల సాఫీగా..

మొహాలీ మ్యాచ్‌నే తీసుకొంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ)తో సమావేశం ఏర్పాటు చేసి టీ20 ఏర్పాట్లను సమీక్షించారు. దాంతో ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలకు తొలిరోజు ఒకింత సాంకేతిక సమస్యలు ఏర్పడడం తప్పితే.. క్రమ పద్ధతిలోనే సాగాయి. ఇక రెండో టీ20కి ఆతిథ్యమిచ్చిన నాగ్‌పూర్‌లోనూ విదర్భ క్రికెట్‌ సంఘం కూడా స్థానిక అఽధికార యంత్రాంగం సహకారంతో చక్కటి ఏర్పాట్లు చేసింది. 


హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైంది..

టిక్కెట్లు విక్రయించే విషయంలో హెచ్‌సీఏ అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదు. జింఖానా వద్ద సరైన ఏర్పాట్లు చేయడం పూర్తిగా విఫలమైంది. కనీసం టిక్కెట్ల కోసం వచ్చిన అభిమానుల కోసం హెచ్‌సీఏ మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉంది. కమిషనర్‌తో చర్చించిన తర్వాత ఎలా దర్యాప్తు చేయాలో ఒక నిర్ణయానికి వస్తాం.     

  - డీఎస్‌ చౌహాన్‌ (అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.