Sopen Shah: మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2022-06-10T13:42:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Sopen Shah: మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు

విస్కాన్సిన్‌‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఇండో-అమెరికన్ సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా అధ్యక్షుడు నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్షభవనం ప్రకటించింది. జూన్ 6వ తేదీన బైడెన్ చేపట్టిన కీలకమైన ఆరు నియామకాల్లో సోపెన్‌ది ఒకటని వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, సోపెన్‌ నియామకం ఆమోదం పొందితే మాడిసన్‌లోని యూఎస్ అటార్నీ ఆఫీస్‌కి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఆమె ఘనత దక్కించుకుంటారు. 


సోపెన్ షా కెంటుకీలో స్థిరపడ్డారు. 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్‌ కోయి ఎల్‌ఎల్‌పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు. సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్‌ సివిల్‌, క్రిమినల్‌ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు. ఇదిలాఉంటే.. ఇటీవల దేశవ్యాప్తంగా కాల్పుల ఘటనలు రోజురోజుకీ పెరుగుతుండడంతో మార్షల్ వ్యవస్థను బలపరిచేందుకు అధ్యక్షుడు వరుసగా నియామకాలు చేపడుతున్నట్లు అధ్యక్షభవనం వెల్లడించింది. 

Updated Date - 2022-06-10T13:42:44+05:30 IST