యూఎస్‌లో భారతీయ అమెరికన్ల హవా నడుస్తోంది: బైడెన్

ABN , First Publish Date - 2021-03-05T15:30:40+05:30 IST

ఇటీవల అంగారకుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పర్సివియరన్స్‌’ రోవర్‌ విజయవంతమైనందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాసా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

యూఎస్‌లో భారతీయ అమెరికన్ల హవా నడుస్తోంది: బైడెన్

వాషింగ్టన్: ఇటీవల అంగారకుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పర్సివియరన్స్‌’ రోవర్‌ విజయవంతమైనందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాసా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. గురువారం వీడియో కాల్ ద్వారా నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీకి (జేపీఎల్‌) టీమ్‌తో బైడెన్ ముచ్చటించారు. కాగా, ఈ టీమ్‌లో భారత సంతతి మహిళ స్వాతి మోహన్ కూడా సభ్యురాలు అనే విషయం తెలిసిందే. పర్సివియరన్స్ సేఫ్ ల్యాండింగ్‌లో కీలక పాత్ర పోషించారు స్వాతి. ఈ సందర్భంగా ఆమెతో బైడెన్ ప్రత్యేకంగా సంభాషించారు. 


'యూఎస్‌లో భారతీయ అమెరికన్ల హవా నడుస్తోంది. మీరు(స్వాతి), ఉపాధ్యక్షురాలు(కమలా హ్యారిస్), నా స్పీచ్ రైటర్(వినయ్ రెడ్డి) ఇలా చాలా మంది కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెమ్మదిగా అమెరికాలోని అన్ని రంగాల్లో మీ ప్రాబల్యం పెరుగుతోంది. అమెరికాను అక్రమించేస్తున్నారు. మీరు నిజంగా అద్భుతమైన వ్యక్తులు. ఇది నిజంగా గర్వించాల్సిన విషయం.' అని స్వాతితో బైడెన్ అన్నారు. తమ టీమ్‌తో ఇలా ప్రత్యేకంగా మాట్లాడటం పట్ల బైడెన్‌‌కు స్వాతి ధన్యవాదాలు తెలియజేశారు. కానీ, నాసా టీమ్‌తో ఇలా మాట్లాడటం తనకు దక్కిన గౌరవం అని బైడెన్ తెలిపారు. ఇలా సుమారు 10 నిమిషాల పాటు అధ్యక్షుడు నాసా టీమ్‌తో ముచ్చటించారు.


ఇక నాసా ప్రయోగించిన పర్సివియరన్స్‌ రోవర్‌ అక్కడ ల్యాండయిందనే విషయాన్ని మొదట ప్రకటించింది స్వాతి మోహన్‌. జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలోని కంట్రోల్‌ రూమ్‌లో కూర్చుని.. ‘‘టచ్‌ డౌన్‌ కన్‌ఫర్మ్‌డ్‌. వుయ్‌ ఆర్‌ సేఫ్‌ ఆన్‌ మార్స్‌’’ అంటూ రోవర్‌ ల్యాండింగ్‌ గురించి ప్రకటించింది. ఇదిలాఉంటే.. 50 రోజుల తన పరిపాలనలో సుమారు 55 మంది భారతీయ అమెరికన్లకు వివిధ కీలక బాధ్యతలు అప్పగించారు బైడెన్.  

Updated Date - 2021-03-05T15:30:40+05:30 IST