భారతీయ అమెరికన్లపై బిడెన్ ప్రశంసల జల్లు !

ABN , First Publish Date - 2020-09-23T16:54:00+05:30 IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ భారతీయ అమెరికన్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికా ఆర్ధిక వృద్ధికి భారతీయ అమెరికన్లు ఎంతో కృషి చేశారని అన్నారు. వారి కృషి, వ్యవస్థాపకత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చాయని, దేశంలో సాంస్కృతిక చైతన్యాన్ని సృష్టించడానికి సహాయపడ్డాయని పేర్కొన్నారు.

భారతీయ అమెరికన్లపై బిడెన్ ప్రశంసల జల్లు !

వాషింగ్టన్ డీసీ: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ భారతీయ అమెరికన్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికా ఆర్ధిక వృద్ధికి భారతీయ అమెరికన్లు ఎంతో కృషి చేశారని అన్నారు. వారి కృషి, వ్యవస్థాపకత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చాయని, దేశంలో సాంస్కృతిక చైతన్యాన్ని సృష్టించడానికి సహాయపడ్డాయని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన 'నేషనల్ వర్చువల్ ఫండ్‌రైజర్' కార్యక్రమంలో బిడెన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


మంగళవారం భారతీయ అమెరికన్లు నిర్వహించిన నేషనల్ వర్చువల్ ఫండ్‌రైజర్‌ను ఉద్దేశించి మాట్లాడిన బిడెన్... కమ్యూనిటీ సభ్యులు, మెగా దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాను అధ్యక్షుడినైతే హెచ్-1బీ వీసా, చట్టబద్ధమైన వలసదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


"ఈ సంఘం దేశం కోసం ఏమి చేసిందో ఆలోచించండి. దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలు, సిలికాన్ వ్యాలీకి పునాది వేసిన ఆవిష్కర్తలు, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సంస్థలను నడిపించే ప్రతిభావంతులు ఈ సంఘం నుంచి వచ్చారని" భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ అన్నారు.


"మీరు ఈ దేశంలో ఆర్థిక మరియు సాంస్కృతిక చైతన్యాన్ని సృష్టించడానికి సహాయం చేశారు. ఇది వలస వచ్చిన దేశానికి మీరు ఏమిటో తెలియజేస్తుంది. మీ సాంస్కృతిక, సామాజిక, కుటుంబ విలువలు ఎంతో అభినందనీయం. అందుకే మీపట్ల నాకు ప్రత్యేక గౌరవం ఉంది" అని చెప్పారు.


ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌పై విరుచుకుపడిన బిడెన్... "ఆయన తీసుకున్న హెచ్-1బీ, జాతి వివక్షత, వాతావరణ సంక్షోభం వంటి అన్ని హానికరమైన చర్యలు సాధారణ ముప్పుకు దారితీశాయి. ఈ అధ్యక్షుడు అన్ని విషయాలను దిగజార్చారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ రేపటికి వారి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుంది అనడంలో సందేహం లేదని" అన్నారు.


"అధ్యక్షుడిగా నేను చెత్తగా కాకుండా ఉత్తమమైన పాలనను అందించబోతున్నాను. మహమ్మారిని జయించడం, పతనమైన దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పిల్లలకు నాణ్యమైన విద్య, మన ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే మరియు విలువలను ప్రతిబింబించే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రూపొందిస్తానని" బిడెన్ తెలిపారు.

Updated Date - 2020-09-23T16:54:00+05:30 IST