భారత చిత్రకారుడి అద్భుత ప్రతిభ.. UAE పాలకుల భారీ పెయింటింగ్స్‌తో గిన్నీస్ రికార్డు బద్దలు!

ABN , First Publish Date - 2022-01-30T16:23:17+05:30 IST

సరన్స్ కేకే అనే భారతీయ చిత్రకారుడు యూఏఈ పాలకుల భారీ పెయింటింగ్స్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు.

భారత చిత్రకారుడి అద్భుత ప్రతిభ.. UAE పాలకుల భారీ పెయింటింగ్స్‌తో గిన్నీస్ రికార్డు బద్దలు!

అబుదాబి: సరన్స్ కేకే అనే భారతీయ చిత్రకారుడు యూఏఈ పాలకుల భారీ పెయింటింగ్స్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్‌సీ) మెయిన్ హాల్‌లో సరన్స్ రూపొందించిన 166.03sq.m ఆర్ట్‌వర్క్.. 'ఒకే కళాకారుడు వేసిన అతిపెద్ద ప్రొఫెషనల్ ఆయిల్ పెయింటింగ్' విభాగంలో ప్రపంచ రికార్డుకెక్కింది. గతేడాది నవంబర్ చివరి వారంలో సరన్స్ ఈ పెయింటింగ్స్ వేశాడు. అయితే, కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఆమోదం, ధృవీకరణకు సమయం పట్టింది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆ దేశ ప్రధాని, ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో పాటు అబుదాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చిత్రాలను 166.03sq.m సైజులో సరన్స్ గీయడం జరిగింది. దాంతో ఇంతకుముందు చైనీస్ ఆర్టిస్ట్ లి హాంగ్యు నెలకొల్పిన రికార్డును సరన్స్ బద్దలు కొట్టాడు. 2020లో హాంగ్యు.. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చిత్రపటాన్ని భారీ సైజులో రూపొందించాడు. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఒకే కళాకారుడు వేసిన ప్రొఫెషనల్ ఆయిల్ పెయింటింగ్. కానీ, తాజాగా సరన్స్ గీసిన పెయింటింగ్ హాంగ్యు రికార్డును బద్దలు కొట్టింది. దాంతో అదే విభాగంలో అతి పెద్ద పెయింటింగ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కింది.


ఈ సందర్భంగా సరన్స్ మాట్లాడుతూ.. తన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. "చాలా సంతోషంగా ఉన్నా. యూఏఈ-భారత్ చిరకాల స్నేహానికి ఇది నా నివాళి. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ జరుగుతున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, యూఏఈ 50వ నేషనల్ డే వేడుకల సందర్భంగా ఈ ఆయిల్ పెయింటింగ్‌ను వేశాను. వీటిని దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో ప్రదర్శించడం ద్వారా యూఏఈ పాలకులు చూడాలనేది నా కోరిక. ఇది కల నిజమయ్యే క్షణం” అని సరన్స్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే సరన్స్ ప్రస్తుతం పిల్లల కోసం అబుదాబిలో ఆర్ట్ అకాడమీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాడు. కేరళకు చెందిన ఈ 30 ఏళ్ల చిత్రకారుడు తన విజిట్ వీసాను క్యాన్సిల్ చేసుకొని యూఏఈలోనే స్థిరపడాలని చూస్తున్నాడు. అలాగే తన ప్రతిభకు గుర్తుగా యూఏఈ ప్రభుత్వం తనకు గోల్డెన్ వీసా మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాడు. ఇక సరన్స్ తన పెయింటింగ్స్‌తో తాజాగా క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డుకు గుర్తింపుగా యూఏఈలోని భారత రాయబార కార్యాలయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అతడ్ని ప్రత్యేకంగా సన్మానించింది. అబుదాబిలోని ఐఎస్‌సీలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమంలో భారత రాయబారి సంజయ్ సుధీర్‌తో పాటు ఐఎస్‌సీ, లులు గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యూసఫలీ.. సరన్స్‌కు ప్రశంస పత్రాన్ని అందజేశారు. 



Updated Date - 2022-01-30T16:23:17+05:30 IST