వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు కావాలి: బోయింగ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత విమానయాన రంగం ప్రధానంగా మూడు సవాళ్లను ఎదుర్కొంటోందని బోయింగ్ కమర్షియల్ ఏరోప్లేన్స్ మేనేజింగ్ డైరెక్టర్ (రీజినల్ మార్కెటింగ్) దేవ్ షుల్టే తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో విమానయాన ఇంధనం ధర 90 శాతం అధికంగా ఉంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 70 శాతా న్ని విదేశీ కరెన్సీల్లో చెల్లించాల్సి వస్తోంది. తక్కువ దూరాల ప్రయాణ చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే అతి తక్కువ సగటు చార్జీలు ఉన్నాయని చెప్పారు.
వచ్చే రెండు దశాబ్దాల కాలంలో దక్షిణాసియా విమాన ప్రయాణికుల వృద్ధికి భారత్ కీలకం కానుందని వివరించారు. ఈ ప్రాంత ట్రాఫిక్‌లో 90 శాతం వాటాతో భారత మార్కెట్ అగ్రగామిగా ఉందని బోయింగ్ వెల్లడించింది. బోయింగ్ అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో దక్షిణాసియా విమానయాన రంగానికి కొత్తగా 2,400 విమానాలు అవసరమవుతాయని తెలిపింది. 2040 నాటికి భారత విమానయాన సంస్థలకు 2,000కు పైగా సింగిల్-ఆసిల్ విమానాల అవసరం ఉంటుంది. 240 వైడ్ బాడీ విమానాలు, 75 ఫ్రైటర్ విమానాలను అవసరమవుతాయని తెలిపింది. భవిష్యత్తులో కొత్త పైలట్లు, టెక్నీషియన్లు, క్యాబిన్ సిబ్బంది కలిపి మొత్తం లక్ష మంది కావాల్సి ఉంటుందని బోయింగ్ వెల్లడించింది.
ఎస్ఏఎఫ్ వినియోగానికి ఒప్పందం
భారత విమానయాన రంగంలో సస్టేనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్) వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి బోయింగ్, స్పైస్‌జెట్, సీఎ్‌సఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) చేతులు కలిపాయి.