ఢంకా మోగించి ఉత్సవాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు మోహన్‌బాబు
మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చింది
జాతీయ సాంస్క ృతిక్ మహోత్సవ్ ప్రారంభ సభలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 26: భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలు గొప్పవని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. జాతీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జాతీయ సాంస్కృతిక్ మహోత్సవాన్ని శనివారం ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మరో ముఖ్య అతిథిగాను, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, కలెక్టర్ హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, రుడా చైర్మన్ ఎం.షర్మిళారెడ్డి గౌరవ అతిథులుగాను హాజరయ్యారు. గవర్నర్ జ్యోతిప్రజ్వలన చేసి మహోత్సవాలను ప్రారంభించారు. అతిథులను జాతీయ సాంస్కృతిక శాఖ పక్షాన జాయింట్ సెక్రటరీ అమితా ప్రసాద్ సారాబాయి, దీపిక, కిరణ్ సోని సత్కరించారు. తొలుత గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం నుంచి బ్రిటిషర్లను తరిమికొట్టడంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ పాత్ర కీలకమైనదన్నారు. మహాత్మాగాంధీ ప్రజలను చైతన్యవంతం చేసి క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చూట్టారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎంతో మంది మహనీయులు ప్రాణాలర్పించారని చెప్పారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్యావనిలో ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు, దేశ సమగ్రతను, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ప్రధాని మోది ‘ఆజాదికా అమృత్ మహోత్స్సవ్’ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో జాతీయ సాంస్కృతిక్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారని, ఇది సమావేశం కాదని... ఒక వేడుక అన్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన కళాకారులకు, కవులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.