Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థపై జైశంకర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-12T02:02:20+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం కోసం గట్టి కృషి చేస్తున్నట్లు

Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థపై జైశంకర్ వ్యాఖ్యలు

రియాద్ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం కోసం గట్టి కృషి చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar) చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం (Ukraine Crisis) సవాళ్లు విసిరినప్పటికీ, ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మూడు రోజుల సౌదీ అరేబియా (Saudi Arabia) పర్యటన శనివారం నుంచి ప్రారంభమైంది. 


జైశంకర్ ఇచ్చిన ట్వీట్‌లో, భారత సంతతి (Indian Community) ప్రజలతో సంభాషించడంతో తన సౌదీ అరేబియా పర్యటన ప్రారంభమైందని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళపై భారత సంతతి ప్రజల స్పందనను ప్రశంసించానని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ, జాతీయ స్థాయిలో జరుగుతున్న పరివర్తన సమయంలోనూ దేశం ఏ విధంగా కోలుకున్నదీ వివరించానని చెప్పారు. 


భారత సంతతి ప్రజలతో శనివారం మాట్లాడుతూ, క్రెడిట్, బ్యాంకింగ్, విద్య, కార్మిక విధానాలను మార్చగలిగే మార్గాల గురించి భారత దేశం (India) ఆలోచిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, అత్యధిక ఆదాయంగల దేశంగా మారడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం దార్శనికత, వివేకంతో ఆర్థిక వనరుల నిర్వహణ అవసరమని చెప్పారు. 


చాలా కీలక సంస్కరణలు అమలవుతున్నాయని, వీటి ఫలితాలను స్పష్టంగా చూడవచ్చునని చెప్పారు. 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువ ఎగుమతులు చేశామన్నారు. మొత్తం ఎగుమతుల విలువ 670 బిలియన్ డాలర్లు అని వివరించారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ప్రపంచం ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కొంటోందన్నారు. అయితే భారత దేశం ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. కనీసం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పారు. 


Updated Date - 2022-09-12T02:02:20+05:30 IST