Kuwait లోని భారత ఎంబసీ ఉదారత.. అనారోగ్యం బారిన పడ్డ ప్రవాసుడిని స్వదేశానికి తరలించడంలో చేయూత

ABN , First Publish Date - 2022-07-08T15:35:23+05:30 IST

ఉపాధి కోసం కువైత్ వెళ్లిన భారత ప్రవాసుడు ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తోటివారు అతడిని ఫర్వానియా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ విషయాన్ని అక్కడి చెన్నై కమ్యూనిటీ సంఘం ద్వారా భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రవాసుడికి అన్ని విధాల సహకరించి స్వదేశానికి..

Kuwait లోని భారత ఎంబసీ ఉదారత.. అనారోగ్యం బారిన పడ్డ ప్రవాసుడిని స్వదేశానికి తరలించడంలో చేయూత

కువైత్ సిటీ: ఉపాధి కోసం కువైత్ వెళ్లిన భారత ప్రవాసుడు ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తోటివారు అతడిని ఫర్వానియా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ విషయాన్ని అక్కడి చెన్నై కమ్యూనిటీ సంఘం ద్వారా భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయం ప్రవాసుడికి అన్ని విధాల సహకరించి స్వదేశానికి పంపించింది. ఇలా కష్ట సమయంలో ప్రవాసుడిని ఆదుకుని ఎంబసీ ఉదారత చాటింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన రామచంద్రన్ వైరవమూర్తి(48) ఇటీవలే ఉపాధి కోసం కువైత్ వెళ్లాడు. అయితే, మే 4న ఉన్నట్టండి తాను నివాసం ఉంటున్న గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటివారు అతడిని హూటాహూటిన ఫర్వానియా ఆస్పత్రికి తరలించారు. 


వైరవమూర్తిని పరీక్షించిన వైద్యులు అతను సెరిబ్రల్ హెమటోమాతో(Cerebral Hematoma) బాధపడుతున్నట్లు తేల్చారు. అతనికి కొన్ని రోజుల పాటు చికిత్స కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, వైరవమూర్తికి అక్కడ తెలిసిన వాళ్లు గానీ, బంధువులు గానీ ఎవరూ లేరు. దాంతో వెంటనే స్వదేశానికి తరలించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తమిళ్ మక్కల్ సెవై మైయం కువైత్ అధ్యక్షుడు అలీ, సామాజిక కార్యకర్త షినీ ఫ్రాంక్ భారత ఎంబసీ దృష్టకి తీసుకెళ్లారు. దాంతో రాయబార కార్యాలయానికి చెందిన కమ్యూనిటీ వెల్ఫేర్ అండ్ లేబర్ వింగ్ సభ్యులు రాహుల్, షాజన్ వెంటనే వైరవమూర్తికి ఆస్పత్రికలో చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత స్వదేశంలోని ఉన్న అతని కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేయడంతో పాటు స్వదేశానికి తరలించడానికి వారి సహయం కోరారు. ఈ విషయంలో భారత్‌లోనే ఉన్న సామాజిక కార్యకర్త మతి కీలకంగా వ్యవహరించి స్వదేశానికి తరలించడంలో సహకరించారు. 


భారత రాయబారి సిబి జార్జ్ సూచన మేరకు ఎంబసీ అధికారులు అతని స్వదేశానికి తరిలించే సమయంలో కావాల్సిన స్ట్రెచర్, అతనితో పాటు వెళ్లేందుకు ఓ మెడికల్ పర్సన్, వారిద్దరికి విమాన టికెట్లను ఏర్పాటు చేశారు. వీటికి అయిన వ్యయం మొత్తాన్ని భారత ఎంబసీనే భరించింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి జూన్ 19న కువైత్ నుంచి చెన్నైకి పంపించింది. ఇక స్వదేశానికి వచ్చిన తర్వాత సామాజిక కార్యకర్త మతి ఇక్కడ కావాల్సిన మెడికల్ సపోర్ట్‌ను చూసుకున్నారు. చెన్నై విమానాశ్రయం నుంచి నేరుగా వైరవమూర్తిని చికిత్స నిమిత్తం పుడుకొట్టై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొంతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలా భారత ఎంబసీ కష్ట సమయంలో ప్రవాసుడిని ఆదుకుని ఉదారతను చాటుకుంది.  

Updated Date - 2022-07-08T15:35:23+05:30 IST