కువైత్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన.. భారత్‌లో చిక్కుకున్న వారికోసం..!

ABN , First Publish Date - 2021-04-23T15:55:03+05:30 IST

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుని.. తిరిగి కువైత్ వెళ్లేలనుకునే భారతీయులకు సహాయం చేసేందుకు సిద్ధం అయింది. ఇందుకోసం తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కువైత్‌కు తిరిగి రావాలనుకునే వారు..

కువైత్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన.. భారత్‌లో చిక్కుకున్న వారికోసం..!

కువైత్ సిటీ: కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుని.. తిరిగి కువైత్ వెళ్లేలనుకునే భారతీయులకు సహాయం చేసేందుకు సిద్ధం అయింది. ఇందుకోసం తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కువైత్‌కు తిరిగి రావాలనుకునే వారు https://forms.gle/sExZK1GKW36BLpVz7 లింక్ ద్వారా లేదా ఇండియన్ ఎంబసీ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఎంత మంది భారతీయులు తిరిగి కువైత్ రావాలనుకుంటున్నారనే దానిపై స్పష్టత వస్తుందని ఇండియన్ ఎంబసీ అభిప్రాయపడింది. కువైత్‌కు రావాలనుకునే భారతీయుల సంఖ్యపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ విషయాన్ని కువైత్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వారి ప్రయాణానికి మార్గం సుగమం చేయనున్నట్టు తెలిపింది. భారత్‌లో చిక్కుకోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, కువైత్‌లోని యజమానుల నుంచి శాలరీ బకాయిలను పొందాల్సిన వాళ్లు, కువైత్‌లో కుటుంబ సభ్యులను కలిగి ఉన్న వారు, రెసిడెన్సీ  గడువు ముగిసిపోవడం వల్ల కువైత్‌కు రాలేకపోతున్నవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపింది. 




ఇదిలా ఉంటే.. కువైత్ దాదాపు సంవత్సరం నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా విజృంభన నేపథ్యంలో మొదటగా గత ఏడాది మార్చి 13న కువైత్ ఎయిర్‌పోర్ట్‌లను మూసేసింది. ఆగస్టు 1న వాటిని తెరిచినప్పటికీ హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా కువైత్‌కు రాకుండా అడ్డుకుంది. కువైత్ రూపొందించిన హైరిస్క్ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. అనంతరం 14 రోజుల క్వారెంటైన్ నిబంధనతో భారత ప్రయాణికులు నేరుగా కువైత్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడటంతో కువైత్ మళ్లీ విమానాశ్రయాలను మూసేసింది. తర్వాత పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించడం, నాన్ కువైత్ ప్రయాణికుల ప్రవేశంపై నిషేధం విధించడంతో వేలాది మంది భారతీయులు కువైత్ వెళ్లలేక భారత్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కాగా.. భారత్‌లో కొవిడ్ తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ఇండియన్ ఎంబసీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలవంతం అవుతాయో వేచిచూడాల్సిందే.  


Updated Date - 2021-04-23T15:55:03+05:30 IST